Disha App: రాష్ట్రంలోని 1.16 కోట్ల మంది మహిళలు రికార్డు స్థాయిలో దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఆపదలో ఉన్న మహిళలు ఫోన్‌ను 5 సార్లు అటూఇటూ ఊపితే చాలు... 10 నిమిషాల్లో పోలీసులు చేరుకుని సమస్యను తెలుసుకుంటారు. ఇదో గొప్ప కార్యక్రమం’ అని సీఎం జగన్ తెలిపారు. 163 దిశ పెట్రోలింగ్ వాహనాలు, మహిళా కానిస్టేబుళ్ల కోసం 18 కారవాన్లను సీఎం బుధవారం సచివాలయం ప్రధాన గేటువద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలోని ప్రతి గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో 15వేల మంది మహిళా పోలీసులు పని చేస్తున్నారు. మహిళలకు అన్యాయం జరిగితే ఈ ప్రభుత్వం ఊరుకోదనే సంకేతాలను పంపిస్తున్నాం. ఇప్పటికే 900 దిశ ద్విచక్ర వాహనాలు పోలీస్ స్టేషన్లలో అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా 163 దిశ పెట్రోలింగ్ వాహనాలను తెస్తున్నాం. ఇవేకాకుండా అన్ని ఠాణాల్లోని మొత్తం 3,000 వాహనాలకు జీపీఎస్ ట్యాగ్ చేసి, దిశకు అనుసంధానం చేశాం. 10 నిమిషాల్లో కచ్చితంగా చేరుకోవాలని గట్టిగా చెప్పా. డీజీపీ రాజేంద్రనాథరెడ్డి, డీఐజీ పాలరాజు, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ విషయంలో బాగా కృషి చేశారు’ అని సీఎం వివరించారు.
మహిళా కానిస్టేబుళ్లకు కారవాన్లు: ‘మహిళా కానిస్టేబుళ్ల కోసం ఇప్పటికే పోలీస్ స్టేషన్లలో ప్రత్యేకంగా వాష్‌రూమ్‌లను తీసుకొచ్చాం. వీళ్లు బందోబస్తుకు వెళ్లినప్పుడు ఇబ్బందులు పడకుండా ప్రత్యేకంగా వాష్‌రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్స్ ఉండే 18 కారవాన్లను ప్రారంభిస్తున్నాం. ఇలాంటివి మొత్తం 30 వాహనాలను సమకూరుస్తాం’ అని జగన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మండలి ఛైర్మన్ మోషేను రాజు, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథరెడ్డి, డీఐజీ పాలరాజు, దిశ ప్రత్యేక అధికారి కృతికా శుక్లా తదితరులు పాల్గొన్నారు.
"రాష్ట్రంలోని 1.16 కోట్ల మంది మహిళలు రికార్డు స్థాయిలో దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఆపదలో ఉన్న మహిళలు ఫోన్‌ను 5 సార్లు అటూఇటూ ఊపితే చాలు... 10 నిమిషాల్లో పోలీసులు చేరుకుని సమస్యను తెలుసుకుంటారు. ఇదో గొప్ప కార్యక్రమం." - సీఎం జగన్
ఇదీ చదవండి: న్యాయస్థానాల్లో వారికి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది: హైకోర్టు