ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ దిల్లీ వెళ్ళనున్నారు. ఉదయం 8నుంచి 10 గంటల వరకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే పోలీసు అమర వీరుల దినోత్సవంలో సీఎం పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయం వెళ్తారు. 10 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ వెళతారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు దిల్లీ వెళ్లనున్నారు.
12.05 గంటలకు దిల్లీ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా జన్‌పథ్-1కు వెళ్లనున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో సీఎం సమావేశం కానున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సీఎం జగన్ భేటీ కానున్నారు.
పోలవరం ప్రాజెక్టుకు రివర్స్ టెండరింగ్ వల్ల కలిగిన ప్రయోజనాలు వివరిస్తూనే... కేంద్రం నుంచి అదనంగా నిధులు ఇచ్చే అంశంపై చర్చించనున్నారు. తెలంగాణ భూభాగం నుంచి గోదావరి నీటిని ఎపీకి తీసుకురావడం... 2నదుల అనుసంధానం చేసేందుకు ఆర్థిక సహాయం చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం కోరారు. ఈ విషయమై మరోసారి జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కోరనున్నారు.
వీటితో పాటు గోదావరి నుంచి రాయలసీమ ప్రాంతానికి నీటిని మళ్లించేందుకు ఉద్దేశించిన... పలు ప్రాజెక్టుల రూపకల్పనపై కేంద్రమంత్రితో చర్చించనున్నారు. అనంతరం కేంద్ర విద్యుత్ రెన్యువబుల్ ఎనర్జీ మంత్రి రాజ్‌కుమార్ సింగ్‌తో సీఎం జగన్ భేటీ కానున్నారు. పీపీఏలపై సమీక్షకు సంబంధించిన అంశంపై చర్చించనున్నారు.
రాష్ట్రానికి సంబంధించి సమస్యల పరిష్కారం సహా... నిధులు రాబట్టే అంశమై పలువురు మంత్రులను కలిసేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇవాళ రాత్రికి కూడా దిల్లీలోనే బస చేయనున్నారు. రేపు అధికారిక కార్యకలాపాలు పూర్తి చేసుకుని తిరిగి అమరావతి రానున్నారు.
ఇదీ చదవండి