రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకే విధంగా కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్ పరిస్థితులపై ఏపీ సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి కట్టడిపై మంత్రులు ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా కర్ఫ్యూపై నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు కానుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సడలింపు ఇచ్చారు. రాత్రి 9 గంటలకు దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ అధికారులకు పలు సూచనలు చేశారు.
మాస్క్ ధరించకపోతే రూ.100 జరిమానా కచ్చితంగా అమలు
మాస్క్ ధరించకపోతే రూ.100 జరిమానా కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. దుకాణాల్లో సిబ్బంది, కొనుగోలుదారులకు మాస్కు తప్పనిసరి ఉండాలని సూచించారు. నిబంధన ఉల్లంఘిస్తే దుకాణాలకు భారీ జరిమానాలు విధించాలని.. దుకాణాలు 2–3 రోజులు మూసివేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. నిబంధనల ఉల్లంఘనపై ఫొటో తీసి పంపినా జరిమానాలు విధిస్తామని చెప్పారు. ఫొటోలు పంపేందుకు ప్రత్యేక వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.
అందరూ మాస్క్ ధరించేలా మార్కెట్ కమిటీలు
రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ కఠినంగా అమలు చేయాలని అధికారులకు తెలిపారు. ప్రజలెవ్వరూ గుమిగూడకుండా కఠిన ఆంక్షలు విధించాలని.. మార్కెట్లు, తదితర చోట్ల మాస్కులు ధరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అందరూ మాస్క్ ధరించేలా.. మార్కెట్ కమిటీలు చూడాలని సూచించారు.
పాఠశాలలు పునః ప్రారంభమయ్యే లోపు ప్రభుత్వ, ప్రైవేటు టీచర్లకూ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. థర్డ్ వేవ్ హెచ్చరికల దృష్ట్యా ఆ మేరకు సన్నద్ధం కావాలన్నారు. ఫీవర్ సర్వే అనంతరం జ్వరం, ఇతర లక్షణాలు ఉన్నవారికే పరీక్షలు చేసి, తగిన మందులు అందించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 97 చోట్ల 134 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటుపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. కొవిడ్ యేతర వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఇదీ చూడండి:
రాష్ట్ర నీటి హక్కుల్ని తెలంగాణ హరిస్తున్నా..ఎందుకు అడ్డుకోవట్లే