స్మార్ట్ పోలీసింగ్‌లో మొదటి ర్యాంక్ సాధించిన పోలీసు శాఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను..డీజీపీ గౌతమ్ సవాంగ్, పోలీస్ ఉన్నతాధికారులు కలసి స్మార్ట్ పోలీసింగ్ సర్వే రిపోర్ట్‌ను అందజేసి, వివరాలు వెల్లడించారు. స్మార్ట్ పోలీసింగ్‌లో ఏపీకి నెంబర్ వన్ ర్యాంక్ వచ్చిందని ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సర్వేలో వెల్లడైందన్నారు.
స్మార్ట్ పోలీసింగ్‌పై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సర్వే నిర్వహించిందని, తొమ్మిది ప్రామాణిక అంశాల్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాలలో సర్వే నిర్వహించిందని తెలిపారు. 2014 డీజీపీల సదస్సులో స్మార్ట్ పోలీసింగ్ పద్దతులను పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు స్పందించి.. స్మార్ట్ పోలీసింగ్ నిర్వహిస్తున్న రాష్ట్రాలలో ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సర్వే చేపట్టిందని చెప్పారు.
ఏడేళ్లుగా ఈ సర్వే నిర్వహిస్తున్నారని.. మొదటి సారిగా ఏపీ పోలీసు శాఖ ఫస్ట్ ర్యాంకు సాధించిందని చెప్పారు. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సభ్యులుగా రిటైర్డ్ డీజీలు, ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు, ఐఐటీ ప్రొఫెసర్లు, పౌర సమాజానికి సంబంధించిన ప్రముఖులు ఉన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, నిష్పక్షపాత, చట్టబద్ద, పారదర్శకత, జవాబు దారీతనం, ప్రజల నమ్మకం.. వంటి విభాగాల్లో రాష్ట్రానికి మొదటి స్థానం వచ్చిందని చెప్పారు. పోలీస్ సెన్సిటివిటీ, ప్రవర్తన, అందుబాటులో పోలీస్ వ్యవస్ధ, పోలీసుల స్పందన, టెక్నాలజీ ఉపయోగం వంటి విభాగాల్లోనూ అత్యుత్తమ ర్యాంకి్ వచ్చినట్లు డీజీపీ ముఖ్యమంత్రికి వివరించారు.
ఇదీ చదవండి: AYYANNA PATHRUDU PROTEST: నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు ఇంటికి పోలీసులు