భారత్‌బంద్‌కు తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో కాంగ్రెస్, తెరాస సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో వివిధ పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించాయి.
భువనగిరిలో నిర్వహించిన భారత్ బంద్‌లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. బీబీనగర్ మండలం కొండమడుగు వద్ద తెరాస ఆధ్వర్యంలో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై స్థానిక భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, తెరాస కార్యకర్తలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
వామపక్షాలు భువనగిరి పట్టణంలో ఓ బేకరి షాప్‌ను బంద్ చేయించే క్రమంలో... రాళ్లు విసరడంతో ఓ రాయి అక్కడే ఉన్న భాజపా కార్యకర్తకు తగలింది. దీనితో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. భాజపా, వామపక్ష కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పట్టణ పోలీసులు వచ్చి మూడు పార్టీల కార్యకర్తలను శాంతింపజేసి అక్కడినుంచి పంపించేశారు. భువనగిరి పట్టణంలో ఎల్ఐసీ కార్యాలయాన్ని మూసివేయిస్తున్న వామపక్ష కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని వ్యాన్‌లో పీఎస్‌కు తరలించారు. పట్టణంలో నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి: