తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావు మరణంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (JUSTICE NV RAMANA) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన 35 ఏళ్ల సుదీర్ఘ కాలంలో న్యాయం కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. జస్టిస్ కేశవరావు మృతి తెలంగాణ హైకోర్టుకు తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
జస్టిస్ పి. కేశవరావు ప్రస్థానం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావు (60) కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున 3.47 గంటలకు తుదిశ్వాస విడిచారు. జస్టిస్ కేశవరావు 1961 మార్చి 29న జన్మించారు. కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1986లో బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేసుకుని న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. పలు కీలకమైన సివిల్, క్రిమినల్ కేసులను విజయవంతంగా వాదించారు. 1991 నుంచి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. సీబీఐ, జీహెచ్ఎంసీ, ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2017 సెప్టెంబర్ 21 నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ పి.కేశవరావు సేవలందించారు. ఆయన మృతితో హైకోర్టు.. నేడు తెలంగాణలో కోర్టులకు సెలవు ప్రకటించింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం
జస్టిస్ పి.కేశవరావు మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలియజేశారు. పేదలకు ఆయన అందించిన న్యాయ సేవలను సీఎం స్మరించుకున్నారు.
ఇదీ చదవండి:
RRR on RSP: 'పోలీసుగా ఉండి రాజకీయాలు మాట్లాడవద్దని మాత్రమే అన్నా..!'