చింటు, బంటు(పేర్లు మార్చాం) ఇద్దరు అన్నదమ్ములు. చింటుకు తొమ్మిదేళ్లు.. బంటుకి ఎనిమిదేళ్లు. ఈ ఇద్దరు పిల్లలు కలిసి.. 20 నుంచి 25 రోజుల్లోనే ఏకంగా నాలుగు లక్షలు ఖర్చు చేశారు. అదేలా సాధ్యం? ఏం చేసుంటారు? అసలు వాళ్లకు అంత డబ్బెక్కడిదీ? ఇలా మీ మెదళ్లలో ప్రశ్నల పరంపర మొదలైందా? వాటన్నింటికీ సమాధానం కావాలంటే.. చింటు, బంటుల కథ సావదానంగా చదవాల్సిందే..!
చింటు, బంటుల కుటుంబం హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఎస్సార్నాయక్ నగర్లో ఎనిమిదేళ్లుగా అద్దెకుంటున్నారు. చింటు, బంటుల నాన్న ఉద్యోగం చేస్తుంటాడు. అమ్మ ఇంట్లోనే ఓ చిన్న కిరాణా దుకాణం నడిపిస్తోంది. ఈ ఇద్దరు చిన్నారులకు ఇంకో ఇద్దరు అన్నదమ్ములు దోస్తులున్నారు. అయితే వారి వయసు మాత్రం ఒకరిది 15, మరొకరిది 14. పాఠశాలకు సెలవులు కావటంతో పిల్లలు ఇంట్లో ఉండటం.. లేదా స్నేహితులతో ఆడుకోవటం.. పరిపాటిగా మారింది. అయితే.. ఈ రెండు నిత్యకృత్యాలే ఈ కథలో కీలకాంశాలుగా మారాయి. పిల్లల్లంతా కలిసి ఆడుకునేందుకు వెళ్లినప్పుడు.. రోజూ కొంత చిల్లర డబ్బు తీసుకురావటం బేకరీల్లో ఏదో ఒకటి తినటం చింటు, బంటుకు అలవాటైంది. ఇది గమనించిన.. చింటు, బంటుల దోస్తులు.. వాళ్ల అమాయకత్వాన్ని వాడుకోవాలని చూశారు. వయసులో పెద్దవాళ్లు కావటంతో.. తెలివిగా చింటు, బంటును మచ్చిక చేసుకున్నారు. "మీరు రోజూ ఇలా పైసలు తీసుకొస్తున్నారు.. మీ ఇంట్లో చాలా డబ్బుంటుంది కదా..!" అని తెలియనట్టు ఆసక్తి నటిస్తూ అడిగారు. దానికి.. "అవును.. మా ఇంట్లో మస్తు పైసలున్నాయి. మా నాన్న బీరువాలోని బ్యాగులో పైసలు దాచిపెడతాడు.." అని చింటు, బంటులు వివరంగా ఇంటి గుట్టు బయటపెట్టారు.
పాఠశాలలకు సెలవులు కావటంతో.. పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని గమనిస్తూనే ఉన్నారు. ఇంట్లో వాళ్ల అమ్మానాన్న డబ్బులు దాచేది కూడా ఆ చిన్నారులు చూస్తున్నారు. వాళ్ల తల్లిదండ్రులు కూడా.. ఎప్పుడు వాళ్లున్నారని ఎప్పుడు చాటుగా దాయటం లాంటివి చేయలేదు. ఆసలు ఆ విషయమే వాళ్ల మనసులోకి రాలేదు. అయితే.. ఏప్రిల్ 22న ఒకరి దగ్గరి నుంచి రావాల్సిన డబ్బు అందటంతో.. దాన్ని వాళ్ల నాన్న ఇంట్లో దాచటం చింటు, బంటు చూశారు. సుమారు నాలుగు లక్షలను ఒక డబ్బాలో పెట్టడాన్ని గమనించారు. ఈ విషయాన్నే చింటు, బంటు.. పూసగుచ్చినట్టు దోస్తులకు చెప్పారు. ఇంకేముంది.. వాళ్ల దగ్గరి నుంచి ఎలాగైనా.. పైసలు రాబట్టుకుని జల్సా చేయాలనుకున్నారు ఆ అతితెలివైన దోస్తులు.
మొదటగా.. ఓ వాచీని చింటుకు ఎరగా వేశారు. స్పోర్ట్స్ వాచీని చూసిన చింటు వాళ్ల మాయలో పడి.. డబ్బాలో నుంచి రెండువేల నోటును ఇచ్చాడు. వాళ్లు అంతటితో ఆగకుండా.. కొత్తకొత్త ఆటబొమ్మలు కొనిస్తామని ఊదరగొట్టారు. ఈసారి.. నోటు కాకుండా ఏకంగా రెండువేల నోట్ల కట్టనే సమర్పించుకున్నాడు మన చింటు. ఇదే అదునుగా చేసుకుని.. బంటును కూడా ముగ్గులోకి దింపారు. "నీకు కూడా మీ అన్నయ్యలా మంచి మంచి వాచీలు, బొమ్మలు కొనిస్తాం.." అని చెప్పారు. ఇంకేముంది ఆ మాటలకు కరిగిన బంటు.. మూడు ఐదు వందల రూపాయల నోట్ల కట్టలు ఇచ్చేశాడు. ఇలా.. ఓసారి మొబైల్ అని... ఇంకోసారి ఇయర్‌ఫోన్స్ అని.. ఫ్రెండ్ నాన్నకు యాక్సిడెంట్ అయ్యిందని.. కారణాలు చెప్తూ చిన్నారుల చేత డబ్బులు రాబడుతూనే ఉన్నారు. ఇక.. చివరికి ఏకంగా ఇంట్లోకి వచ్చి మిగిలిన డబ్బును బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ఇంత జరుగుతున్నా.. తల్లిదండ్రులకు పిల్లలు ఒక్కమాట కూడా చెప్పలేదు. డబ్బాలో మొత్తానికే డబ్బు లేకపోతే ఏమవుతుందోనని.. చింటు, బంటులే దుకాణంలో కొన్ని డమ్మీ నోట్లు కొనుక్కొచ్చి వేశారు.
కట్ చేస్తే.. 25 రోజుల తర్వాత.. దాచిన డబ్బును ఓసారి చూసుకుందామని డబ్బా తీసిన చింటు, బంటుల నాన్న ఒక్కసారిగా అవాక్కయ్యాడు. 25 రోజుల ముందు నాలుగు లక్షలు డబ్బాలో పెడితే.. నాలుగైదు నోట్లే కనిపిస్తున్నాయేంటని నోట మాట రాలేదు. ఆ కనిపించే నోట్లు కూడా దుకాణంలో అమ్మే డమ్మీవి. ఇంకేముంది.. ఈ నెల 10న పోలీసుల దగ్గరికి వెళ్లి లబోదిబోమన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. విచారణ చేస్తామని చెప్పారు. విచారణ చేసే క్రమంలో.. పిల్లలపై అనుమానం రాగా... ఆరా తీస్తే.. అసలు కథ బయటపడింది.
మోసం చేసిన పిల్లలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ డబ్బుతో చింటు, బంటులకు కొనిచ్చిన వాచీలు, ఇయర్ ఫోన్స్, ఓ మొబైల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవే కాక.. ఆన్లైన్ గేమ్స్ ఆడటం, సినిమాలు చూడటం చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. డబ్బుల విషయంలో పిల్లలను కాస్త దూరంగా ఉంచాలని పోలీసులు సూచించారు. సాధారణంగానే పిల్లలు ఏం చేస్తున్నారు..? ఎటు వెళ్తున్నారు..? లాంటి విషయాలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని సూచిస్తున్నారు.
ఇవీ చూడండి: