కరోనా మహమ్మారి పేద బాలికల ఆశలను చిదిమేస్తోంది. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేయాలన్న వారి ఆశలు అడియాశలవుతున్నాయి. కరోనా భయం..లాక్‌డౌన్‌లతో కుటుంబ ఆర్థిక పరిస్థితులు తలకిందులు కావడంతో పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నతనంలోనే పెళ్లిపీటలు ఎక్కిస్తున్నారు. ఒకప్పుడు మూఢనమ్మకాలు, లేదా కన్యాశుల్కం.. అదీకాదంటే మధ్యయుగాల నాటి అరాచకాలు, అత్యాచారాల కారణంగా మనదేశంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. కరోనా మహమ్మారి మళ్లీ అలాంటి తీవ్రమైన పరిస్థితులను తీసుకువచ్చినట్లు కనిపిస్తోంది. ఈ వైరస్ ఒకరికి సోకితే చాలు కుటుంబాలకు కుటుంబాలే కల్లోలంలో చిక్కుకోవడం.. లేదా కుటుంబ పెద్దలు కన్నుమూస్తున్న పరిస్థితులు గ్రామీణంలోని పేద, బడుగువర్గాల వారిని మళ్లీ బాల్యవివాహాల వైపు తరుముతున్నాయి. తాము లేకపోతే పిల్లల పరిస్థితి ఏమిటనే ఆందోళనతో చాలామంది పసివయసులోనే ఆడపిల్లలను పెళ్లి పీటలు ఎక్కిస్తున్న దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ఏడాది కాలంలో తెలంగాణలో బాల్యవివాహాలపై నమోదైన కేసులే ఇందుకు నిదర్శనం!
ఆ జిల్లాల్లో ఎక్కువగా ఈ కేసులు
పరిమిత సంఖ్యలో బంధువుల సమక్షంలో శుభకార్యాలు చేయాలన్న నిబంధన కూడా ఉండడంతో తక్కువ ఖర్చుతో బాధ్యతల నుంచి బయటపడవచ్చనే ఉద్దేశంలో కొందరు ఇప్పుడే పెళ్లిళ్లు చేసేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు చూడలేక, తల్లిదండ్రుల మాటను కాదనలేక చిన్నారులు తలవంచుతున్నారు. 2017 ఆగస్టు నుంచి 2019 అక్టోబరు వరకు దాదాపు రెండేళ్లలో 157 కేసులు మాత్రమే నమోదు కాగా 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి వరకు ఏడాది కాలంలోనే 693 బాల్య వివాహాల కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. ముఖ్యంగా తెలంగాణలో వెనుకబడిన జిల్లాలైన వనపర్తి, గద్వాల, వికారాబాద్, నాగర్ కర్నూలు, నారాయణపేటలలో ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదైనట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది.
బయటపడనివెన్నో..
ఇలాంటి బాల్య వివాహాలు చాలావరకు గుట్టుచప్పుడు కాకుండానే జరిగిపోతున్నాయి. చదువుకోవాలన్న ఆశతో కొందరు బాలికలో లేదా ఇరుగుపొరుగున ఉండేవారో ఫిర్యాదు చేస్తే కాని ఇలాంటివి వెలుగుచూడడంలేదు. ఎవరైనా అడ్డుకునేందుకు వెళ్తే బంధువులు దాడులు చేయడం పరిపాటిగామారింది. కొన్ని సందర్భాల్లో గుర్తింపు కార్డుల్లో పుట్టినతేదీ తప్పుగా వేసి, 18 ఏళ్లు నిండినట్లు చూపిస్తున్నారు. కరోనా తొలిదశలో గత ఏడాది మే, జూన్ నెలల్లో ఇలాంటి వివాహాలు ఎక్కువగా జరిగాయి. ఈసారైనా గ్రామస్థాయిలో అధికారులు నిఘా పెట్టాల్సి ఉంది.
ఇదీ చదవండి