కరోనా నివారణకు తమ కుటుంబం తరపున వ్యక్తిగతంగా 10లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని తెదేపా అధినేత చంద్రబాబు నిర్ణయించారు. టీడీఎల్పీ సభ్యులు సైతం తమ నెల వేతనాన్ని సహాయ నిధికి ఇవ్వనున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ఇవ్వాలనే ప్రతిపాదనకు సభ్యులంతా సానుకూలంగా స్పందించారు. కరోనాను ఎదుర్కొనేందుకు అంతా ఐక్యంగా పని చేయాలని చంద్రబాబు... నేతలకు పిలుపునిచ్చారు . విపత్కర పరిస్థితుల్లో తోచిన విధంగా సాయం చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ తమవంతుగా ప్రభుత్వాలకు సహకరించాలన్న తెదేపా అధినేత... కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
రూ. 5వేల ఆర్థిక సాయం చేయాలి...
పనులు లేక ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం 5 వేల రూపాయిల ఆర్థిక సహాయం ఇవ్వాలని సూచించారు. సామాజిక మాధ్యమాల ద్వారా కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చే విధంగా అందరూ కృషి చేయాలని కోరారు. వీలైనంత వరకూ ఒకరికొకరు దూరం పాటించి కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.