వారం రోజుల పాటు ఇల్లు మునిగితేనే... నిత్యావసరాలు ఇస్తామనడం కంటే దుర్మార్గం ఇంకోటి లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. ముంపు నష్టానికి, ప్రభుత్వ సాయానికి తూకం వేయడం దారుణమని మండిపడ్డారు. విపత్తుల్లో వైకాపా ప్రభుత్వం చేతులెత్తేస్తే, ముఖ్యమంత్రి జగన్ గాల్లో ప్రదక్షణ చేసి చేతులు దులుపుకొన్నారని ధ్వజమెత్తారు. మంగళవారం పార్టీ నియోజకవర్గ ఇంఛార్జీలు, సీనియర్ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముంపు బాధితులకు రూ.500 ఇవ్వడం ఏంటని ధ్వజమెత్తారు.
ఏడాదిన్నరగా వరుస విపత్తులతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జీవనోపాధి కోల్పోయి చేతి వృత్తులవారిలో నైరాశ్యం నెలకొందన్నారు. కరోనా నియంత్రణ, వరద నీటి నిర్వహణ, బాధితులకు సహాయ చర్యలు, రైతులను ఆదుకోవటం, చేతివృత్తులవారికి అండగా ఉండటం ఇలా అన్ని అంశాల్లోనూ సీఎం జగన్ విఫలమయ్యారని ఆరోపించారు. ఇంత విఫల ముఖ్యమంత్రిని చరిత్రలో చూడలేదని పేర్కొన్నారు. దుర్మార్గుల పాలనలో మంచివాళ్లకు అన్నీ ఇబ్బందులేనని... రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
బలహీన వర్గాలపై ఈతరహా దాడులు గతంలో ఎన్నడూ చూడలేదని చంద్రబాబు పేర్కొన్నారు. అంబేడ్కర్ విగ్రహాలను కూడా ధ్వంసం చేస్తున్నారని ఆక్షేపించారు. దేవుళ్ల విగ్రహాలు, మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే.. ప్రభుత్వం చోద్యం చూస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వైకాపా ఇసుకాసురులు పేట్రేగిపోతున్నారని విమర్శించారు. ఇసుక దొరక్క, పనులు లేక భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలే శరణ్యం అంటున్నా... జగన్‌లో మార్పు లేదన్నారు. వైకాపా చెడ్డపనులతో, తెదేపా మంచి పనులను ప్రజలు బేరీజు వేస్తున్నారని వివరించారు.
ఒక పార్టీపై అక్కసుతో, పనులను నిలిపేసిన ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడలేదని చంద్రబాబు మండిపడ్డారు. తెదేపా అధికారంలోకి వస్తే ఈ పాటికి పోలవరంతో పాటు మరో 15ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసేవాళ్లమని చెప్పారు. పోలవరం పనులు ఎందుకు రద్దు చేశారని నిలదీశారు. రాయలసీమ జిల్లాలకు, దుర్భిక్ష ప్రాంతాలకు నీరు ఇచ్చేవాళ్లమని స్పష్టం చేశారు. దీనిపై ప్రజలను చైతన్యపర్చాల్సిన బాధ్యత పార్టీ నాయకులదేనని స్పష్టం చేశారు. సంస్థాగత కమిటీల్లో నూతనంగా ఎంపికైన సభ్యులు చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పగా.. అధినేత వారికి అభినందనలు తెలిపారు.
"కొత్త బాధ్యతలను మరింత చురుగ్గా నిర్వర్తిస్తూ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలి. వైకాపా బాధితులకు కమిటీలు అండగా ఉండాలి. ఈ రోజు చేసుకునే సంస్థాగత నిర్మాణంతో పార్టీ మరో 30ఏళ్లు ప్రజాదరణ పొందాలి. తెదేపా వచ్చాకే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కింది. రాజధానికి శంకుస్థాపన చేసి 5ఏళ్లవుతోంది. మరో 50రోజుల్లో అమరావతి పరిరక్షణ ఉద్యమం ప్రారంభమై ఏడాదవుతుంది. రైతులు,మహిళలు, రైతుకూలీల ఉసురు తీస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత పోరాడితే ప్రజల్లో అంత ఆదరణ పెరుగుతుంది. భేషజాలకు పోవడం నాయకత్వ లక్షణం కాదు. అందరితో సమన్వయం చేసుకుంటూ రెట్టింపు స్ఫూర్తితో ముందుకు సాగాలి." -చంద్రబాబు, తెదేపా అధినేత