అమరావతికి పూర్తిగా సహకరిస్తానని ఆనాడు జగన్ చెప్పారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. అన్ని పుణ్యక్షేత్రాల నుంచి జలం, మట్టి తీసుకొచ్చి శంకుస్థాపన చేశామని చంద్రబాబు చెప్పారు. రాజధానిగా అమరావతే ఉండాలని 50 శాతం కంటే ఎక్కువమంది చెప్పారన్న చంద్రబాబు... అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉన్న ప్రాంతం.. అమరావతి అని వివరించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్లేందుకు అనుకూలమైన ప్రాంతమని స్పష్టం చేశారు. 5 జాతీయ రహదారులకు అనుకూలంగా ఉన్న ప్రాంతం.. అమరావతి అని వివరించారు.
తాత్కాలిక భవనాలు కాదు.. శాశ్వత భవనాలే..
అమరావతిలో 9 సిటీలు అభివృద్ధి చేయాలని అనుకున్నామని చంద్రబాబు వివరించారు. సుప్రీంకోర్టు సీజే వచ్చి అమరావతిలో హైకోర్టుకు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. అమరావతిలో చేసిన భూసేకరణ ప్రపంచానికే ఆదర్శమన్న చంద్రబాబు... అమరావతి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇచ్చారని చెప్పారు. ఐదేళ్ల తెదేపా పాలనలో 62 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని... అమరావతిలో అద్భుతమైన భూగర్భ పైపులైను వ్యవస్థ ఏర్పాటు చేశామని వివరించారు. అమరావతిలో 45 నుంచి 80 శాతం పనులు పూర్తయ్యాయన్న చంద్రబాబు... అమరావతిలో తాము కట్టినవి తాత్కాలిక భవనాలు కాదు.. శాశ్వత భవనాలని పేర్కొన్నారు. దేశంలోనే ఎక్కడా లేని సచివాలయం నిర్మించామని చెప్పారు.
గ్రాఫిక్స్ అంటున్నారు...
అమరావతిలో ఏమీ జరగలేదు.. గ్రాఫిక్స్ అంటున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రాఫిక్స్ అనేవాళ్లు ఒకసారి అమరావతికి వెళ్లి చూడాలని సూచించారు. అమరావతిలో 186 హౌసింగ్ భవనాలకు శ్రీకారం చుట్టామన్న చంద్రబాబు... ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులకు నివాస భవనాలు తలపెట్టామన్నారు. ఈ భవనాలన్నీ పూర్తి చేస్తే ఇప్పటికే అమరావతి రూపురేఖలు మారేవని పేర్కొన్నారు. అమరావతిలో ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదని... అక్కడ వచ్చిన ఆదాయంతోనే అభివృద్ధి జరిగేలా ప్రణాళికలు వేశామని చంద్రబాబు వివరించారు. అమరావతిని రెండు దశల్లో అభివృద్ధి చేయాలని అనుకున్నామని చెప్పారు.
ఇదీ చదవండీ... 'అచ్చెన్నాయుడిని ఏపీ ప్రభుత్వం చంపేసేలా ఉంది'