ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి బహిరంగ క్షమాపణలు చెప్పి... అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలన్నారు. దౌర్జన్యం, అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్ధులను ఉత్తమ పౌరులుగా తీర్చే ఉపాధ్యాయులను రోడ్డెక్కించిన చరిత్ర జగన్‌దేనని ధ్వజమెత్తారు. బదిలీల్లో పారదర్శకత కోసం కౌన్సెలింగ్ విధానానికి తెదేపా శ్రీకారం చుడితే.. వెబ్ కౌన్సెలింగ్ పేరుతో జగన్ వేధిస్తున్నారని విమర్శించారు. న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గమన్న చంద్రబాబు...ఉపాధ్యాయుల బదిలీలో వైకాపా నాయకులు జోక్యం చేసుకుంటూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.
ఎప్పటికప్పుడు బకాయిలు లేకుండా సమయానికి డీఏలను ఇస్తానని ఎన్నికల ముందు చెప్పి ఇప్పుడు వాయిదాల్లో చెల్లిస్తామని ఉత్తర్వులు ఇవ్వటం విడ్డూరమన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లో సీపీఎస్‌ను రద్దు చేస్తానని చెప్పి ఇంతవరకూ ఎలాంటి ఉత్తర్వులివ్వలేదని మండిపడ్డారు. 11వ పీఆర్సీ ఎప్పుడు ఇస్తారో ఎందుకు సమాధానం చెప్పట్లేదని నిలదీశారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ప్రచారం పిచ్చితో పాఠశాలలు తెరిచి వేలాది మంది విద్యార్దులు, వందలాది మంది ఉపాధ్యాయులు కరోనా బారిన పడేలా చేశారని ఆక్షేపించారు. కరోనాతో చనిపోయిన వారి మరణాలకు ప్రభుత్వమే కారణమన్న చంద్రబాబు... భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఉపాధ్యాయులను మద్యం షాపులలో పెట్టి వారి చేత మద్యం అమ్మించిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: