అమరావతి రైతులు అంతిమ విజయం సాధించేవరకూ వారి పోరాటానికి తెదేపా సంపూర్ణ మద్దతు ఉంటుందని.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉద్ఘాటించారు. రైతులు చూపుతున్న తెగువ భవిష్యత్ తరాలకు స్ఫూర్తి అని కొనియాడారు. ఎన్నో అవమానాలు భరించి చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఒత్తిళ్లను అమరావతి ఉద్యమకారులు తట్టుకున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని రైతుల ఉద్యమం 500వ రోజుకు చేరిన సందర్భంగా అమరావతి ఐకాస వర్చువల్‌గా నిర్వహించిన ఉద్యమభేరి సభలో పాల్గొన్నారు.
'హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన అనుభవంతో అమరావతిని అభివృద్ధి చేయాలనుకున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజన్-2020కి ప్రణాళిక రూపొందించా. విజన్-2020ని తల్చుకుంటే ఇప్పటికీ సంతృప్తి కల్గిస్తోంది. ఒకచోట అభివృద్ధి ప్రారంభిస్తే దేశమంతటికీ నాంది పలుకుతుంది.'- తెదేపా అధినేత చంద్రబాబు
అమరావతిపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని అభివృద్ధి చేస్తే సంపద సృష్టించే నగరంగా మారేదని అన్నారు. అమరావతి.. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టని.. అమరావతి ద్వారా లక్ష నుంచి 2 లక్షల కోట్ల ఆదాయం వచ్చేదని చంద్రబాబు చెప్పారు.
ఇదీ చదవండి: పరీక్షల అంశంపై హైకోర్టులో విచారణ.. మే 3కు వాయిదా