ఫిలిప్పీన్స్ మనీలా విమానాశ్రయంలో చిక్కుకున్న 146 మంది భారతీయులను వెనక్కి రప్పించేలా చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రి జై శంకర్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. వారిలో 41 మంది ఏపీకి చెందినవారు కాగా.. 30 నుంచి 40 మంది తెలంగాణ విద్యార్థులున్నారని తెలిపారు. వీరిలో అనేకమంది ఎంబీబీఎస్ చదివేందుకు ఫిలిప్పీన్స్‌కు వెళ్లారని లేఖలో పేర్కొన్నారు.
భారత్ వచ్చేందుకు మార్చి17వ తేదీన మనీలా విమానాశ్రయానికి చేరుకున్న వీరు..ఆకస్మికంగా విమానాలన్నీ రద్దవటంతో అక్కడే చిక్కుకుపోయారని చంద్రబాబు లేఖలో వివరించారు. స్వస్థలాలకు చేరేందుకు విమానాలు లేవని, ఈరోజు అర్ధరాత్రికి ఎయిర్ పోర్ట్ మూసేస్తున్నట్లు సమాచారం ఉందనే విషయాన్ని ప్రస్తావించారు. దీని వల్ల అక్కడి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందని తెలిపారు. తక్షణమే స్పందించి విద్యార్థులను మనీలా నుంచి స్వస్థలాలకు చేర్చేలా శ్రద్ధ చూపాలని కోరారు. దిల్లీ, హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:
'ఆరు గంటలకు ఒకసారి పారాసిటమాల్ వేసుకోండి'