ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రమాణాల ప్రకారం మొత్తం ప్రసవాల్లో సిజేరియన్లు 5-15% మధ్యే ఉండాలి. సిజేరియన్లు ఎప్పుడు చేయాలనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలున్నా వీటి సంఖ్య పెరిగిపోతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఎవరి వాదన వారిదే
రాష్ట్రంలో ప్రాథమిక, సామాజిక, ప్రాంతీయ, జిల్లా, బోధనాసుపత్రులు ఉన్నాయి. పీహెచ్‌సీలలో సీనియర్ వైద్యులు, స్టాఫ్‌నర్సులు ఉండి, సహజ ప్రసవానికి అవకాశాలు ఎక్కువగా ఉంటేనే ధైర్యం చేస్తున్నారు. లేదంటే సమీపంలోని సామాజిక, ప్రాంతీయ ఆసుపత్రులకు గర్భిణులను పంపుతున్నారు. నొప్పులతో సమీపంలోని పీహెచ్‌సీకి వెళ్లినా, అక్కడి నుంచి ప్రాంతీయ, కేంద్రాసుపత్రులకు పంపిస్తున్నారు. ప్రసవ సమయంలో వైద్యులు, సిబ్బందిలో ఉండాల్సిన సహనం చాలావరకు కనిపించడంలేదు. ‘క్లిష్ట పరిస్థితుల్లో గర్భిణులను బోధనాసుపత్రులకు పంపిస్తున్నారు. దీనివల్ల మేము తప్పక సిజేరియన్లు చేస్తున్నాం’ అని సూపరింటెండెంట్లు చెబుతున్నారు. ‘గర్భిణులు సకాలంలో ఆసుపత్రులకు రావడంలేదు. మావద్ద స్పెషాల్టీ వైద్యులు ఉండరు. ప్రాణాపాయం వల్ల వారిని పెద్దాసుపత్రులకు పంపక తప్పట్లేదు’ అన్నది ప్రాంతీయ, సామాజిక, జిల్లా ఆసుపత్రుల వాదన. ఇలా ఒకరిపై ఒకరు నెపం నెట్టేస్తున్నారు. ప్రతినెలా 9వ తేదీన తమ పరిధిలోని గర్భిణులు సమీప ప్రభుత్వాసుపత్రులకు వెళ్లి వైద్యులను సంప్రదించేలా ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు చూడాలి. హైరిస్కు కేసులను గుర్తించి వారికి వైద్యసేవలు అందించాలి. ఇవన్నీ నామమాత్రంగా జరుగుతున్నాయి. రక్తపోటు, మధుమేహం, అధిక రక్తస్రావం, ఉమ్మనీరు పోయి తల్లీబిడ్డల ప్రాణాలకు ఇబ్బంది, గుండె సమస్యలు, రక్తహీనత, కడుపులో బిడ్డ అడ్డం తిరగడం, బిడ్డ చనిపోవడం వంటి ఇబ్బందులుంటే బోధనాసుపత్రులకు తరలిస్తారు. కానీ, సాధారణ కేసులనూ ఇక్కడికి పంపుతున్నారు.
మధ్యాహ్నంలోపే ముహూర్తం
ప్రభుత్వాసుపత్రుల్లో చాలావరకూ సిజేరియన్లు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంటలోగానే జరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో షిఫ్టుల ప్రకారం 24 గంటలూ వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది ఉండాలి. కానీ సాయంత్రం తర్వాత వైద్యులు దాదాపుగా లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. డిప్యూటేషన్లపై ఆసుపత్రుల్లో పనిచేసేవారు, సొంత క్లినిక్‌లు నిర్వహించేవారు, ఆసుపత్రులకు దూరంగా ఉండేవారిలో మధ్యాహ్నంలోపే చకచకా పూర్తిచేయాలన్న ఆతృత ఎక్కువగా కనిస్తోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
వేరే ఆసుపత్రి నుంచి వస్తే సిజేరియనే?
జిల్లాల్లోని వివిధ ఆసుపత్రుల నుంచి కేసులు వస్తే.. సిజేరియన్లు తప్పట్లేదని బోదనాసుపత్రుల వైద్యులు చెప్పడం ఆశ్చర్యకరం. విశాఖ కేజీహెచ్ ప్రసూతి విభాగం, ఘోషాస్పత్రిలలో అత్యధిక ప్రసవాలు సిజేరియన్‌తోనే జరుగుతున్నాయి. వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో 240 వరకు జిల్లా, మాతా శిశు, ప్రాంతీయ, ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి. ఆగస్టు 10 నుంచి 25 వరకు ఇలాంటి 75 ఆసుపత్రుల్లో కలిపి 5,779 ప్రసవాలకు 2,674 సిజేరియన్లు (46.27%) జరిగాయి.
చివరి నిమిషంలో పంపుతున్నారు
‘సీహెచ్‌సీలలో సిజేరియన్లు చేయకుండా ఇక్కడికి ఎందుకు పంపుతున్నారో అర్థం కావట్లేదు. నొప్పులు వచ్చాక అత్యవసరంగా అంబులెన్సుల్లో పంపడంతో సిజేరియన్లు అనివార్యం అవుతున్నాయి’ అని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తెలిపారు.
వచ్చే కేసులన్నీ ఇబ్బందిగానే..
‘మాది సెకండ్ రిఫరల్ ఆసుపత్రి. వచ్చే కేసులన్నీ ఇబ్బందిగానే ఉండి సిజేరియన్లు చేస్తున్నాం’ అని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం డాక్టర్ సునీత పేర్కొన్నారు.
సమస్యలతో సహజ ప్రసవానికి ఇబ్బందులు
‘నెలలు నిండినా నొప్పులు రాకపోవడం, ఉమ్మనీరు తక్కువగా ఉండటం వంటి సమస్యలతో సహజ ప్రసవానికి ఇబ్బందులు వస్తున్నాయి’ అని మచిలీపట్నం జిల్లా ఆసుపత్రిసూపరింటెండెంట్ డాక్టర్ జయకుమార్ చెప్పారు.
ఆందోళనకరమే: వైద్య ఆరోగ్యశాఖ
జిల్లాల్లో సిజేరియన్లు కొన్నిచోట్ల ఎక్కువ చేయడం ఆందోళనకరమే. ఇలాంటిచోట్ల ఆడిటింగ్ చేస్తున్నాం. పలు కేసుల్లో సిజేరియన్లు అక్కర్లేదని గుర్తించాం. అవసరమైనచోట్ల వైద్యుల సంఖ్య పెంచేందుకు నోటిఫికేషన్ ఇచ్చాం.