పెట్టుబడుల అనుమతికి సంబంధించిన ప్రతిపాదనలతో సహా పలు అంశాలపై సమగ్ర నివేదికను పంపాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని (పీపీఎ) కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ కోరింది. దీనిపై మంత్రి లేదా కార్యదర్శి సమక్షంలో ఈ వారంలో ఎప్పుడైనా సమావేశం ఉంటుందని తెలిపింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ సీనియర్ సంయుక్త కార్యదర్శి అనూప్ కుమార్ శ్రీవాత్సవ లేఖ రాశారు.
ప్రాజెక్టు సవరించిన అంచనాలపై గతేడాది నవంబరులో పీపీఎ సమావేశం జరిగింది. 2013-14 ధరల ప్రకారం అయ్యే వ్యయాన్ని చెల్లిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన సర్క్యులర్‌కు ఆమోదం తెలపడంతోపాటు ప్రాజెక్టు పూర్తికి 2017-18 ధరల ప్రకారం సవరించిన అంచనాల మొత్తం అవసరమని సమావేశం పేర్కొంది. అయితే ఈ సవరించిన అంచనాలు ఇప్పటివరకూ పెట్టుబడుల అనుమతులకు వెళ్లలేదు. ప్రాజెక్టు పరిధి, కొత్తగా జత చేసిన పనులు, అంచనాకు సంబంధించి పలు కొర్రీలు వస్తూనే ఉన్నాయి. దీనికి ఆంధ్రప్రదేశ్ సమాధానాలను పంపుతూనే ఉంది.
సవరించిన అంచనాలను ఆమోదించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి విన్నవించింది. ఈ నేపథ్యంలో పోలవరం నిర్మాణంలో ఏపీ ఏకపక్షంగా పలు మార్పులు చేసిందని, కాలువల సామర్థ్యం పెంచిందని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి.. ఏపీ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక ప్రకారమే పనులు చేయాలని లేఖలో సూచించారు. దీనిపై గత నెల 30న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సవివరంగా సమాధానాలిచ్చారు. కొత్తగా తాగునీటి కోసం రూ.912.84 కోట్లతో ఎత్తిపోతల చేపడుతూ 2021 ఏప్రిల్ 19న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిందని, ఈ పథకం ఖర్చును రాష్ట్రమే భరిస్తుందని పేర్కొన్నారు.