Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ పునర్నిర్మాణం, ఇసుక కోత ఏర్పడిన చోట ఫిల్లింగ్ పనులకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేశామని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద సమావేశం నిర్వహించిన ఆయన.. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణం, ప్రాజెక్టు పనుల పురోగతి, పునరావాసం తదితర అంశాలపై సమీక్షించారు. సమీక్షలో ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న చోట సమాంతరంగా మరో వాల్ నిర్మించాలా లేక మరమ్మతులు చేయాలా అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు శ్రీరామ్ పేర్కొన్నారు. సవరించిన అంచనాల విషయంలో కేంద్రం పరిశీలన చేస్తోందని.., సోషీయో ఎకనామిక్ సర్వే తదితర అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. ముందు తొలి దశ అంచనా పూర్తి చేసి దానికి నిధులు మంజూరు చేస్తామని వివరించారు. డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చును కూడా చేర్చి తొలిదశ నిధులు మంజూరు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.
డయాఫ్రం వాల్ దెబ్బతిన్న కారణంగానే పోలవరం ప్రాజెక్టులో పనులు నిలిచిపోయాయని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వరదల కారణంగా ఇసుక కోతకు గురై అగాధాలు ఏర్పడ్డాయని వాటిని పూడ్చే పనిపై దృష్టి పెట్టామని చెప్పారు. డయాఫ్రం వాల్ పాక్షికంగా దెబ్బతిందా లేక పూర్తిగా దెబ్బతిందా ఇంకా చెప్పలేని పరిస్థితి ఉందని అన్నారు. 1.7 కిలోమీటర్ల పొడవున నిర్మించిన డయాఫ్రమ్ వాల్లో పూర్తిగా అధ్యయనం చేయాలని చెప్పారు. మరమ్మతులు చేయాలా లేదా సమాంతరంగా డయాఫ్రం వాల్ నిర్మించాలా దానిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. అధ్యయనం కోసం మరికొంత సమయం పడుతుందని వెల్లడించారు.
డయాఫ్రం వాల్‌తో పాటు లోతైన ఇసుక అగాధాలను బ్రిడ్జి ఫిల్లింగ్ ద్వారా లేదా హైడ్రో ఫిల్లింగ్ ద్వారా చేయాలని భావిస్తున్నట్లు మంత్రి అంబటి తెలిపారు. రెండుసార్లు వచ్చిన వరదల కారణంగా ఇసుక కోతతో అగాథాలు ఏర్పడ్డాయన్నారు. కాపర్ డ్యామ్‌లు నిర్మాణం చేయకుండా ముందుగా డయాఫ్రమ్ వాల్ నిర్మించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగానే పోలవరం పనులు ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఆధునిక దేవాలయంగా ఉన్న పోలవరం ప్రాజెక్ట్‌లో మరో తప్పు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. డయాఫ్రం వాల్ పూర్తి చేయకుండా పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి అవుతుందనే టైం లైన్ చెప్పలేమన్నారు. డయాఫ్రం వాల్ నిర్మాణానికి అగాథాలు పూడ్చడానికి దాదాపుగా 2,500 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి