Central schemes funds: కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర సర్కారు మంగళం పాడుతోంది. కేంద్ర సాయంతో, కేంద్రం అందించే రుణాతో చేపట్టే ప్రాజెక్టులు రాష్ట్రంలో అమలు కావడం లేదు. 2021 - 22 ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా, ఇప్పుడు 2022 - 23 ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లోనూ కేంద్ర సర్కారు 3వేల 824 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇచ్చింది. ఆ నిధులను ఇప్పటివరకూ సంబంధిత పథకాల అమలు ఏజెన్సీలకు ఇవ్వలేదని... కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి సోమనాథన్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయడం వల్ల కేంద్ర పథకాలేవీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు లేఖ ద్వారా తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను ఇవ్వడం లేదని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో కేంద్ర పథకాలను అనుసంధానించగలిగిన వాటిపైనే రాష్ట్రం ఆసక్తి చూపుతోంది. 2022-23 బడ్జెట్ సిద్ధం చేసేటప్పుడే రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్ ఈ విషయాన్ని అన్ని ప్రభుత్వశాఖల అధికారులకు తెలియజేశారు. రాష్ట్ర పథకాలతో అనుసంధానం కాకుండా ఉన్న కేంద్ర పథకాలను అమలు చేయాలంటే... తప్పనిసరిగా ముఖ్యమంత్రి స్థాయిలో అనుమతి తీసుకోవాలన్న నిర్ణయం ఆనాడే జరిగింది. అప్పటినుంచి కేంద్ర పథకాల అమలు, రాష్ట్రం వాటా నిధులిచ్చే అంశంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, జైకా సాయంతో చేపట్టే సాగునీటి ప్రాజెక్టులు, ప్రపంచ బ్యాంకు సాయంతో అమలుచేసే కార్యక్రమాలకు... రాష్ట్రం తన వాటా నిధులు ఇవ్వకపోవడంతో అనేక కీలక ప్రాజెక్టులు పట్టాలెక్కడం లేదు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన చాలా పథకాలు అమలవుతున్నాయి. వీటిలో కొన్నింటికి 90 శాతం, మరికొన్నింటికి 75శాతం, ఇంకొన్నింటికి 60శాతం నిధులను కేంద్రం అందిస్తోంది. మిగిలిన వాటా రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఏటా కేంద్రం నుంచి ఇలాంటి నిధులు సుమారు 20వేల కోట్లు వస్తాయని అంచనా. రాష్ట్ర వాటా 12వేల కోట్ల వరకు ఇవ్వాల్సి ఉందంటున్నారు.
ఇవీ చదవండి: