Loans: నిధుల సమీకరణలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 53 వేల 970 కోట్ల రూపాయలు రుణాల ద్వారా సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈమేరకు 2022-23 బడ్జెట్‌లో పొందుపరిచారు. రిజర్వ్ బ్యాంకు ద్వారా బాండ్లను వేలం వేసి..... ఈ మొత్తాన్ని సమకూర్చుకోనుంది. రుణాల కోసం శుక్రవారం బాండ్లు జారీ చేసి మంగళవారం రోజు ఆర్బీఐ ద్వారా వేలం వేస్తారు. అయితే ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నెల రోజులు పూర్తవుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా రుణం ద్వారా సమకూర్చుకోలేదు. మొదటి త్రైమాసికంలో 15వేల కోట్లు రుణంగా తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో రిజర్వ్ బ్యాంకుకు ప్రతిపాదనలు పంపింది. ఏప్రిల్ నెలలో 3000కోట్లు, మేలో 8000 కోట్లు, జూన్‌లో 4000కోట్లు రుణంగా తీసుకునేందుకు ఆర్బీఐకి వివరాలు పంపింది. అయితే ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి రుణం తీసుకోలేదు. రాష్ట్రాల అప్పులకు సంబంధించి అభ్యంతరాలు లేవనెత్తిన కేంద్ర ప్రభుత్వం... రుణం తీసుకునేందుకు రాష్ట్రాలకు ఇంకా అనుమతులు ఇవ్వలేదు.
Loans: రాష్ట్రాల అప్పులు భారీగా పెరుగుతున్నాయంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. బడ్జెట్‌లో పేర్కొన్న అప్పులు, వాటితోపాటు కార్పోరేషన్ల ద్వారా తీసుకునే ఇతర రుణాలు, ఇలా భారం బాగా పెరుగుతోందని కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అప్పులు, వాటి చెల్లింపులు, చెల్లింపు ప్రణాళికలు, అందుకు తగిన ఆదాయం, సంబంధించిన వివరాలు పూర్తిగా ఇవ్వాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కోరింది. ప్రధానంగా చెల్లింపు ప్రణాళికలపై కేంద్రం ఎక్కువగా దృష్టి సారించినట్లు సమాచారం. అన్ని రాష్ట్రాలతోపాటు తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా సమాచారం, వివరణలు కోరినట్లు తెలిసింది. బడ్జెట్ ద్వారా తీసుకున్న నిర్ధేశిత ఎఫ్ఆర్బీఎం చట్టానికి అనుగుణంగా కేంద్రం అనుమతించిన మేర ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ వెలుపల తీసుకున్న రుణాల విషయమై కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారించినట్లు సమాచారం. వాటికి సంబంధించిన వివరాలు, చెల్లింపుల ప్రణాళిక, అందుకు తగ్గ ఆదాయ వనరులు తదితరాలపై పూర్తి వివరాలు అడిగినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పూర్తి వివరాలు అందించినట్లు సమాచారం. ఇంకా ఇప్పటి వరకు రుణాలకు సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటి అనుమతి రాలేదని చెప్తున్నారు. దీంతో ఈ నెలలో బాండ్ల విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు. ఇతర అవసరాలతోపాటు రైతుబంధు చెల్లింపుల కోసం మే నెలలో ఏకంగా రూ.8000 కోట్ల మేర రుణం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఏప్రిల్‌లో ఇప్పటివరకు రుణం తీసుకునేందుకు అనుమతి ఇవ్వకపోగా... మే నెలలో ఏం జరుగుతుందన్నది చూడాలి.
ఇదీ చూడండి: