కార్వీ ఛైర్మన్ పార్థసారథిని తెలంగాణ సీసీఎస్ పోలీసులు రెండో రోజు ప్రశ్నిస్తున్నారు. ఇండస్ ఇండ్ బ్యాంకులో తనఖా పెట్టిన షేర్లకు సంబంధించిన పూర్తి వివరాలను పార్థసారథి నుంచి సేకరిస్తున్నారు. పెట్టుబడిదారులకు చెందిన డీ మ్యాట్ ఖాతాల్లోని షేర్లను..బ్యాంకులో తనఖా పెట్టి రూ.137 కోట్లను పార్థసారథి రుణంగా తీసుకున్నారు.
ఇండస్ ఇండ్ కేసులో ఈ నెల 26, 27 తేదీల్లో పార్థసారథిని ప్రశ్నించినప్పటికీ...సరైన సమాధానాలు రాబట్టలేకపోయారు. నాంపల్లి న్యాయస్థానం అనుమతితో సీసీఎస్ పోలీసులు మరోసారి రెండు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. నిన్న పార్థసారథి నుంచి కార్వీ సంస్థ లావాదేవీలకు సంబంధించిన సమాచారం సేకరించారు. ఆడిట్ రిపోర్టును పార్థసారథి వద్ద ప్రస్తావించారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్‌తో పాటు అనుబంధ సంస్థలకు చెందిన 6 బ్యాంకు ఖాతాలను సీసీఎస్ పోలీసులు జప్తు చేశారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన వివరాలను పార్థసారథిని అడిగి తెలుసుకుంటున్నారు. సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లోనే పార్థసారథిపై మరో రెండు కేసులు నమోదయ్యాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి 437 కోట్ల రూపాయలు రుణంగా తీసుకొని తిరిగి చెల్లించలేదు. ఈ కేసులోనూ సీసీఎస్ పోలీసులు పార్థసారథి కోసం పీటీ వారెంట్ కోరారు.
ఇదీ చూడండి: Tollywood Drugs case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రేపట్నుంచి ఈడీ విచారణ