"మే నెలలో లక్ష మందికి పైగా ఎలా చనిపోయారో ప్రభుత్వం సమాధానమివ్వాలి జాబ్‌లెస్ క్యాలెండర్‌పై యువత నిరసనలకు దిగితే అత్యాచార కేసులు పెడతారా..? ప్రజలకు మజ్జిగ పోసి ..మీగడ తింటున్నారు"
- చంద్రబాబు(CBN), తెదేపా అధినేత
‘కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులు పడే ఆవేదన, బాధ చూసైనా మీ మనసు కరగలేదా..? కనికరం కలగలేదా..?’ అంటూ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై(CM JAGAN) తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అవసరమైన మందులు లేక తమ వారిని కాపాడుకోలేకపోతున్నామంటూ వారు చేసిన ఆక్రందనలు మీకు వినిపించలేదా..? అని నిప్పులు చెరిగారు. మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించలేని దయనీయ పరిస్థితులు మీకు కనిపించలేదా..? ఈ విషయాలేవీ మీ తాడేపల్లి కోటకు చేరలేదా..? అని నిలదీశారు. మీ మామ కూడా కొవిడ్‌తో చనిపోయినా.. మనసు మార్చుకోవాలన్న ఆలోచన రాలేదా? అంటూ ప్రశ్నించారు. ‘కొవిడ్ బాధితుల డిమాండ్ల సాధన దీక్ష’ పేరిట తెదేపా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. దీక్ష ముగింపు సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. రెండో దశ హెచ్చరికలను పెడచెవిన పెట్టడం వల్లే రాష్ట్రంలో ఇన్ని ఇబ్బందులు తలెత్తాయని విమర్శించారు. కొవిడ్ బారిన పడి రాష్ట్రంలో 12,500 మాత్రమే చనిపోయారని ప్రభుత్వం చెబుతోందని.. ధైర్యం ఉంటే వారి పేర్లు వెల్లడించాలని డిమాండు చేశారు. ‘గత నాలుగైదేళ్ల గణాంకాలు చూస్తే.. ఏపీలో ఏటా మే నెలలో సగటున 27 వేల మరణాలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది 1.27 లక్షల మరణాలు నమోదయ్యాయని అహ్మదాబాద్ ప్రొఫెసర్ వెల్లడించారు. మిగతా లక్ష మంది ఎలా చనిపోయారో, వారిలో కొవిడ్‌తో చనిపోయిన వారెందరో ప్రభుత్వం సమాధానం చెప్పాలని’ ఆయన డిమాండ్ చేశారు.
ఉద్యోగాల కోసం రోడ్డెక్కితే ఆరెస్టు చేస్తున్నారు..
ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌లెస్ క్యాలెండర్‌పై యువత రగిలిపోయి రోడ్డెక్కి నిరసనలు తెలిపితే వారిపై అత్యాచార సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు. ఈ ముఖ్యమంత్రికి, ఈ డీజీపీకి అసలు సిగ్గుందా? ముఖ్యమంత్రి ఇంటి పక్కన, డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో అత్యాచారం జరిగితే ఇంతవరకూ నిందితులను పట్టుకోలేకపోయిన అసమర్థ ప్రభుత్వమిది. ఎవరైనా అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తే చాలు వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, అత్యాచార కేసులు పెడుతున్నారు. సాధన దీక్ష నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇదే రోజు ‘దిశ యాప్ అవగాహన’ కార్యక్రమాన్ని సీఎం తలపెట్టారు. దిశ చట్టం చేసి కేంద్రానికి పంపించినప్పుడే అది తిరుగు టపాలో వస్తుందని నేను చెప్పాను. ముఖ్యమంత్రికి సత్తా ఉంటే ఉన్న చట్టాలే సరిపోతాయి. కొత్తవి అవసరం లేదు.
బ్రిటీష్ వారి కంటే జగన్ దోపిడీయే ఎక్కువ..
జగన్ పనిచేసేది రాష్ట్రం, ప్రజల కోసం కాదు. హోల్‌సేల్‌గా అవినీతి చేసి డబ్బులు సంపాదించాలనేది ఆయన ధ్యేయం. ప్రజలకు మజ్జిగ పోసి ..మీగడ ఆయన తింటున్నారు. బ్రిటీష్ వారి కంటే జగన్ దోపిడీ ఎక్కువైంది. రాష్ట్రానికి గతంలో వచ్చిన కంపెనీలన్నీ వెనక్కి వెళ్లిపోతున్నాయి. జగన్ అవినీతి డబ్బు మాత్రమే.. ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లి అక్కడి నుంచి పెట్టుబడుల రూపంలో తిరిగి వస్తోంది. ప్రజలకు రూ.10 వేలు ఇస్తున్నానని చెప్పి.. వారి నుంచి రూ.30 వేలు లాగేస్తున్నారు. గత రెండేళ్లలో ఒక్కో వ్యక్తిపై రూ.2.50 లక్షల మేర భారం పడింది. పదే పదే ఎల్లో మీడియా అని మాట్లాడే ముఖ్యమంత్రి.. ఆయన బ్లూ మీడియా కథేమిటో చెప్పాలి. తన తండ్రిని ఎవరు చంపారో తెలియాలని వివేకా కుమార్తె అడుగుతున్నారు. అలాంటిది తన బాబాయ్‌ను ఎవరు చంపారో తెలుసుకోవాలని ముఖ్యమంత్రికి లేదా? ఉంది. తెలుసుకుంటే ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. అందుకే గుట్టు బయటకు రాకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు.
కులం బురద పూస్తారా..?
దేశం గర్వించేలా కొవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకొచ్చిన భారత్ బయోటెక్‌కు జగన్‌రెడ్డి.. కులం బురద పూశారు. ఇదా నాగరికత? భారీగా వ్యాక్సిన్లు వేశామంటూ రోజూ ప్రచారం చేసుకోవడం కాదు.. నిజంగా ఒక్క వ్యాక్సినైనా ఆయన కొన్నారా? ఇదేమని ప్రశ్నిస్తే వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీ మీ బంధువులదీ అంటూ నాపై నెపం నెట్టారు. మరి జగన్‌రెడ్డి బంధువులు, సహ నిందితుల కంపెనీలు ఇంజెక్షన్లు తయారు చేశాయి కదా! వారు ఎందుకు ఇవ్వలేదు. రెమిడెసివిర్ ఉత్పత్తి చేసే కంపెనీ ఆయన సహ నిందితుడిదే కదా!
శ్వేతపత్రం విడుదల చేయాలి..
* కరోనా ప్యాకేజీ కింద మహారాష్ట్ర ప్రభుత్వం రూ.5,470 కోట్లు, తమిళనాడు రూ.4,155 కోట్లు, కర్ణాటక రూ.1,250 కోట్లు, కేరళ రూ.20 వేల కోట్లు అక్కడి ప్రజలకు ఇచ్చాయి. ఏపీలో ఏమిచ్చారో శ్వేతపత్రం ఇవ్వాలి.
* కరోనా సంక్షోభ సమయంలో ఒక్క సారైనా జగన్ విలేకరుల సమావేశం పెట్టలేదు. చేతకాదా? చెప్పలేకా? అహంభావమా? ఎందుకు? సమాధానం చెప్పాలి.
* చంద్రన్న బీమా పథకాన్ని రద్దు చేశారు. దానికి ప్రత్యామ్నాయం కూడా చూపలేదు. ఆ పథకం ఈ రోజు ఉండుంటే.. చనిపోయిన లక్ష మంది కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున సాయం అందేది.
తమిళనాడును చూసి నేర్చుకోండి..
అమ్మ క్యాంటీన్ల విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వ్యవహరించిన తీరు చూసి.. జగన్‌రెడ్డి నేర్చుకోవాలి. అమ్మ క్యాంటీన్లను మంచి ఉద్దేశంతో పెట్టారని.. వాటిని తీసేయటం సరికాదంటూ జయలలిత ఫొటోలతోనే వాటిని కొనసాగిస్తున్నారు. డీఎంకే కార్యకర్తలు ఆ క్యాంటీన్లపై దాడి చేస్తే వారిపై కూడా కేసులు పెట్టి చర్యలు తీసుకున్నారు. రాజకీయ సంస్కృతి అంటే అది. ఏపీలో మాత్రం పేదవాడి ఆకలి తీర్చే అన్నక్యాంటీన్లను మూయించేశారు.
రాష్ట్రవ్యాప్తంగా తెదేపా సాధన దీక్షలు..
కరోనా బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెదేపా రాష్ట్ర పార్టీ పిలుపునకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ‘సాధన దీక్ష’లను పార్టీ శ్రేణులు నిర్వహించాయి. పార్టీ ముఖ్య నేతలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు పార్టీ కార్యాలయాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ దీక్షలో పాల్గొన్నారు. అన్ని నియోజకవర్గాలనూ వర్చువల్ విధానంలో రాష్ట్ర పార్టీ కార్యాలయానికి అనుసంధానం చేశారు. ఈ సందర్భంగా కొవిడ్‌తో మృతి చెందిన వారికి నివాళులర్పిస్తూ కొద్దిసేపు మౌనం పాటించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రసంగం తర్వాత స్థానికంగా కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలను ఉద్దేశించి ముఖ్య నేతలు మాట్లాడారు.
ప్రధాన డిమాండ్లు ఇవే..
* యుద్ధ ప్రాతిపదికన అందరికీ వ్యాక్సిన్లు వేయించాలి. 18 ఏళ్లు పైబడిన వారితో పాటు పిల్లలకూ వ్యాక్సిన్ వేయించాలి.
* ప్రతి కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సాయం అందించాలి. సీఎం చేసే అవినీతిలో 10 శాతం వదులుకుంటే ఆ మొత్తం ఇవ్వడం పెద్ద సమస్యేమీ కాదు
* ఆటో డ్రైవర్లు, అసంఘటిత రంగ కార్మికులు, ప్రైవేటు ఉపాధ్యాయులు తదితర వర్గాలకు నెలకు రూ.7,500 చొప్పున ఇవ్వాలి.
* కరోనా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందించాలి. ఆక్సిజన్ అందక చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఇవ్వాలి.
* రైతుల వద్ద కొనుగోలు చేసిన పంటలకు వెంటనే డబ్బులు చెల్లించాలి.
* కొవిడ్ బాధితులకు రూ.2 వేలు చొప్పున, మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు చొప్పున ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వెంటనే ఆ మొత్తం చెల్లించాలి.
* ఫ్రంట్‌లైన్ వారియర్లు మరణిస్తే రూ.50 లక్షల బీమా ఇస్తామని కేంద్రం ప్రకటించింది. వెంటనే బాధితుల కుటుంబ సభ్యులకు ఆ మొత్తం చెల్లించాలి. పాత్రికేయులను ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తించాలి.
సీఎం జగన్‌పై ప్రజాద్రోహం కేసు పెట్టాలి.. ‘సాధన దీక్ష’లో తెదేపా నేతలు
ఈనాడు డిజిటల్, అమరావతి: కరోనా సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి వేలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన సీఎం జగన్‌పై గవర్నర్ ప్రజాద్రోహం కేసు పెట్టాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. తెదేపా నేతలు దీక్ష శిబిరంలో, వివిధ ప్రాంతాల నుంచి వర్చువల్‌గా మాట్లాడారు.
జగన్‌లో చలనం లేదు: అచ్చెన్నాయుడు
కష్టకాలంలో ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకోవాలన్న ధ్యాస సీఎంలో లేకపోవడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సంక్షేమానికి ఎన్ని సలహాలనిస్తున్నా ముఖ్యమంత్రిలో చలనమే లేదు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు కనీసం పోషకాహారం అందించలేదు.
మరణాలకు కారణం సీఎం: యనమల
కరోనా విజృంభిస్తుందని తెలిసినా సీఎం పట్టించుకోలేదు. ఫలితంగా వేల మంది మరణాలకు కారణమయ్యారు. కరోనా కారణంగా నష్టపోయిన బలహీనవర్గాలను ఆదుకోవాలి.
ఎంతమందికిచ్చారు?: అయ్యన్నపాత్రుడు
రాష్ట్రంలో కొవిడ్ కారణంగా లక్షన్నర మంది మరణించారని అంచనా. ప్రభుత్వం మాత్రం 12 వేల మందే అని ప్రకటిస్తోంది. కరోనాతో మరణిస్తే దహన సంస్కారాలకు రూ.15 వేలు ఇస్తామన్నారు. ఇంతవరకూ ఎంత మందికిచ్చారు?
ఆదాయ వనరుగా కరోనా: నక్కా ఆనంద్‌బాబు, కొల్లు రవీంద్ర
కరోనాను ఆదాయ వనరుగా మార్చుకున్న ఘనత జగన్ ప్రభుత్వానిదే. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టుకిట్లను అధిక ధరలకు కొని రూ.కోట్లు దండుకున్నారు. మద్యం, ఇసుక అక్రమ రవాణాతో ఆదాయం పెంచుకుంటున్నారు. కరోనా బాధితులు ఆసుపత్రుల్లో పడకల్లేక అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ సిలిండర్లతో ఆటోలు, అంబులెన్సుల్లో నిరీక్షించాల్సి వచ్చింది.
ఇవీ చదవండి:
భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్లాకు భద్రత పెంపు
RTC EU LETTER: సమస్యలను సత్వరం పరిష్కరిచండి: ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్