జాతీయ నూతన విద్యావిధానం ప్రకారం ప్రాథమిక విద్య మాతృభాషలో బోధిస్తేనే బాగుంటుందని విశ్రాంత ఐపీఎస్ లక్ష్మీనారాయణ అన్నారు. పరభాషలో బోధిస్తే విద్యార్థులు మాతృభాష, ఇతర భాష రెండింటినీ నేర్చుకోలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు. భావ వ్యక్తీకరణకు మాతృభాషపై పట్టు ఎంతో ముఖ్యమని, ఇతర భాషలను సులభంగా నేర్చుకోవచ్చని చెప్పారు.
‘రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సీబీఎస్‌ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీన్ని అమలుచేయాలంటే పాఠశాలల్లో కొన్ని ప్రమాణాలు ఉండాలి. ఇందుకోసం సహకార వ్యవస్థలా మారాలి. ఈ విధానంలో వసతులు ఎక్కడ ఉన్నా వాటిని వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది’ అని సూచించారు. ఏపీ ప్రైవేటు పాఠశాలల సంఘం (ఏపీపీఎస్‌ఏ) ‘జాతీయ విద్యావిధానం’పై మంగళవారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో లక్ష్మీనారాయణ మాట్లాడారు. జాతీయ విద్యా విధానాన్ని పాఠశాలలు ఓ అవకాశంగా మార్చుకుంటే గొప్ప పురోగతి ఉంటుందని సూచించారు.
6వ తరగతిలోనే వృత్తివిద్య
‘ప్రస్తుత విధానంలో విద్యార్థులు చదివే దానికి, చేసే పనికి సంబంధం లేదు. విద్యార్థుల్లో పరిశోధన, సృజనాత్మకత తక్కువగా ఉండి, బట్టీకి ప్రాధాన్యం ఇస్తూ, దేశ సంస్కృతిని మర్చిపోయి, మాతృభాష కన్నా పరభాషపైనే మక్కువ చూపుతున్నారు. వీటిని పరిశీలించాకే జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. వృత్తివిద్య కోర్సుల్ని ఆరో తరగతిలోనే ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. పాఠశాల స్థాయిలో కోడింగ్, ఇంటర్న్‌షిప్‌లు ఉంటాయి. ఫలితంగా 12వ తరగతికి చేరుకునేలోగా విద్యార్థులు కొత్త అంశాలు నేర్చుకుంటారు’ అని వివరించారు. సమావేశంలో ఏపీ ప్రైవేటు పాఠశాలల సంఘం ప్రతినిధులు కొమరగిరి చంద్రశేఖర్, మేకల రవీంద్ర, రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
ఎగువ సీలేరు రివర్స్ పంపింగ్ విద్యుత్ ప్రాజెక్టు కష్టమే..!