తక్కువ ధర భూములకు ఎక్కువ విలువ ఉన్నట్లు చూపి.. వాటిని పూచీకత్తుగా సమర్పించి రుణం తీసుకొని మోసం చేశారన్న అభియోగంపై త్రినేత్ర ఇన్ ఫ్రా వెంచర్ లిమిటెడ్ డైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదైంది. సుమారు 11 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారని భారత పారిశ్రామిక ఆర్థిక సంస్థ.. ఐఎఫ్సీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ హైదరాబాద్ విభాగం కేసు నమోదు చేసింది. త్రినేత్ర ఇన్ ఫ్రా వెంచర్ డైరెక్టర్లు తిరిగి చెల్లించలేదని ఐఎఫ్సీఐ ఫిర్యాదులో పేర్కొంది.
తనఖా పెట్టిన ఏలూరు, బెంగళూరు భూములను వేలం కోసం పరిశీలించగా.. వాటి విలువ తీసుకున్న రుణం కన్నా చాలా తక్కువగా ఉన్నట్లు తేలిందని వివరించారు. ఐఎఫ్సీఐ ఫిర్యాదు మేరకు త్రినేత్ర ఇన్ ఫ్రా వెంచర్తో పాటు దాని ఎండీ ప్రసాద్, డైరెక్టర్లు పి.కోటేశ్వరరావు, ఎం.నరసింహారావు, ఎస్.సుబ్బారావు, కె.రమణ శ్యాంకుమార్, ఆర్.సురేష్ గుప్తాతో పాటు భూముల విలువ నిర్ధరించిన బెంగళూరుకు చెందిన ఎన్.వెంకటేష్ అండ్ అసోసియేట్స్, హైదరాబాద్కు చెందిన డీఎస్కే అవధాని, న్యాయవాది హెచ్.వెంకటేశంపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. రెండు రోజులుగా తెలంగాణ, ఏపీ, కర్ణాటకల్లోని పలు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది.
- ఇదీ చదవండి: 'లేఖ' వివాదం: ఏజీకి అశ్వినీ కుమార్ మరో ఉత్తరం