సీఎం జగన్ కి అమరావతి రాజధాని మీద కక్ష ఉందని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణంలో చంద్రబాబు పేరు సువర్ణ అక్షరాలతో ఉండకూడదనే కుట్రలో భాగమే మూడు రాజధానుల నిర్ణయమని మండిపడ్డారు. రైతులు ఇబ్బందులు పెట్టాలని సీఎం జగన్ మొదటి నుంచే యోచిస్తున్నారని ఆరోపించారు. అందుకే మంత్రులతో లీక్ లు ఇప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ ని రుజువు చేయలేక చేతులెత్తిసి మూడు రాజధానులు తెరమీదకు తీసుకొచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో 15 లక్షల మందికి కరోనా ఉందన్న బుద్ధా వెంకన్న.. రోడ్లపై ప్రజలు ప్రాణాలు వదులుతున్నా.. ముఖ్యమంత్రికి సొంత అజెండాలే ఎక్కువయ్యాయని ఆరోపించారు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రం సర్వనాశనమైందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ధ్వజమెత్తారు. తన స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కొత్తగా నాలుగు జోన్ల ఏర్పాటు వలన ఎటువంటి ప్రయోజనం లేదన్న రాజప్ప కేవలం పట్టుదల కోసమే 3రాజధానులు, జోన్లు అంటూ రాష్ట్రాభివృద్ధిని నీరుగారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక కుటుంబంలో కరోనా పాజిటివ్ వస్తే, ఆ వ్యక్తిని హోమ్ క్వారెంటైన్ చేసి మిగతా కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు చేయడం లేదని మండిపడ్డారు. చీప్ లిక్కర్ ను శానిటైజర్స్ బాటిల్స్ లోవేసి అమ్మడం వలన మరణాలు సంభవిస్తూన్నాయన్న రాజప్ప.. దీనికి సీఎం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: విమ్స్‌లో మంత్రి అవంతిని నిలదీసిన కరోనా రోగుల బంధువులు