ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఉపఎన్నికల సందర్భంగా భాజపా నేతల ఫోన్ల ట్యాపింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి బుధవారం ఆన్‌లైన్ ద్వారా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ప్రచారానికి వెళ్లినప్పుడు రాష్ట్ర నేతలు, దుబ్బాక నేతలు తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పారు. ఈ అంశంపై కేంద్ర హోంశాఖ అధికారులతో చర్చిస్తా. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు లేదా మరేం చేయవచ్చన్నది ఆలోచిస్తా’ అని పేర్కొన్నారు.
ఏ విషయంలో అన్యాయం జరిగింది..
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆక్షేపించారు. రాష్ట్రానికి కేంద్రం ఏ విషయంలో అన్యాయం చేసిందో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. ‘కొవిడ్ సమయంలో తెలంగాణలోని రైతులు, పేదలకు అనేక రకాలుగా కేంద్ర సాయం అందింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరేం చేశాయో చర్చకు సిద్ధమా?’ అని సీఎంకు సవాల్ విసిరారు. ఆరేళ్లలో హైదరాబాద్‌ను తెరాస ప్రభుత్వం అస్తవ్యస్తంగా తయారు చేసింది. రూ.10 వేల వరద సాయంలో తెరాస నేతలు అవినీతికి పాల్పడ్డారు. వరదల్లో నష్టపోయిన రైతులకేం చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. పార్టీ ఫిరాయించినవారి నియోజకవర్గాలకే నిధులిస్తున్నారు. అప్పుల రాష్ట్రంగా, అవినీతికి నిలయంగా మార్చారు’ అని కిషన్‌రెడ్డి అన్నారు. వరదలపై కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక ఇవ్వలేదన్నారు. సీఎం స్పందించి పంట నష్టంపై నివేదిక పంపాలన్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ మొదలైందని.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
జీహెచ్‌ఎంసీలో 100 డివిజన్లు గెలుస్తాం: సంజయ్
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దుబ్బాక ప్రజలు దీపావళి కానుక ఇచ్చారని.. సంక్రాంతి కానుకను జీహెచ్‌ఎంసీ ఓటర్లు ఇస్తారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదు రోజుల క్రితం సర్వే చేయిస్తే భాజపాకు గ్రేటర్‌లో 75 డివిజన్లు వస్తాయని తేలిందన్నారు. దుబ్బాక ఫలితం ప్రభావంతో 100 డివిజన్లు గెలుచుకుంటామన్నారు. 2023లో తెలంగాణలో భాజపా ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. సీఎం తన ఫాంహౌస్‌లో దొడ్డు వడ్లు పండించి.. రైతులతో సన్న వడ్లు సాగుచేయించి మోసం చేశారని విమర్శించారు. రాష్ట్ర ఖజానాను పాతబస్తీలో ఖర్చు చేస్తున్నారని.. అక్కడ ఇంటి, నీటి పన్నులు, విద్యుత్తు బిల్లులతో వచ్చే ఆదాయం.. కొత్త నగరంలో వచ్చే ఆదాయంపై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎంపీలు సోయం బాపురావు, ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రామచందర్‌రావు, పార్టీ నేతలు మురళీధర్‌రావు, లక్ష్మణ్, డీకే అరుణ, ఇంద్రసేనారెడ్డి, గరికపాటి మోహనరావు, మోత్కుపల్లి, పెద్దిరెడ్డి, పి.చంద్రశేఖర్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.