ఏటా హైదరాబాద్‌లో జరిగే బయోఆసియా సదస్సుకు రంగం సిద్ధమైంది. 30 వేలకు పైగా నిపుణులు పాల్గొనే ఈ సదస్సును కరోనా కారణంగా... ఈసారి వర్చువల్‌గా నిర్వహిస్తున్నారు. సదస్సు నిర్వహణలో డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్, నోవార్టిస్, అరబిందో ఫార్మా.. హెటిరో, లారస్ ల్యాబ్స్ వంటి సంస్థలు పాలుపంచుకుంటున్నాయి. వీటితో పాటు లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో దిగ్గజ సంస్థలైన జీవీకే, భారత్ బయోటెక్, ఫెర్రింగ్, సైటివా వంటి సంస్థలు హాజరుకానున్నాయి. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదెళ్ల సహా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యదర్శి బలరామ్ భార్గవ, డబ్ల్యూహెచ్ఓ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యస్వామినాథన్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ పాల్గొననున్నారు. ఈసారి సదస్సు ప్రధానంగా కొవిడ్ విసిరిన సవాళ్లు, లైఫ్ సైన్సెస్ రంగంలో తీసుకువచ్చిన మార్పులు, ఇమ్యునైజేషన్‌లో భారత పాత్ర వంటి అంశాలపై సుధీర్ఘంగా చర్చించనున్నారు.
రెండు రోజుల పాటు జరగే ఈ సదస్సును.. మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణా ఎల్లా, జేఎండీ సుచిత్ర ఎల్లాకు.... జీనోమ్ వ్యాలీ ప్రతిభా పురస్కారం ప్రదానం చేయనున్నారు. 23న జరగబోయే చర్చలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో మంత్రి కేటీఆర్ ముఖాముఖి చర్చలో పాల్గొననున్నారు. ఆరోగ్య పరిరక్షణ రంగంలో సాంకేతికత, డిజిటల్‌సేవలు, అంకురాల పాత్రపై చర్చించనున్నారు. జీవశాస్త్రాల, ఔషధ రంగాల పురోగతిలో..... బయో ఆసియా సదస్సు అమూల్యమైన పాత్ర పోషించిందని పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ పేర్కొన్నారు. కరోనా తర్వాత జరుగుతున్న ఈ సదస్సు కొత్త పరిష్కారాలను చూపుతుందని, కొత్త ఆవిష్కరణలు, ప్రయోగాలకు నాంది అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు