Hyderabad Pub Case: హైదరాబాద్‌లోని పుడింగ్ పబ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగుతోంది. నిందితులిద్దరికీ బెయిల్ ఇవ్వాలని అభిషేక్ తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. పబ్‌లో దొరికిన మాదకద్రవ్యాలకు... అభిషేక్, అనిల్‌కు ఎలాంటి సంబంధం లేదని నిందితుల తరఫు న్యాయవాది వాదించారు. ఇప్పటికే పోలీసులు ఇద్దరు నిందితులను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారని.. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని కోర్టుకు తెలిపారు. రేపు పోలీసుల తరఫు న్యాయవాది వాదించనున్నారు.
ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పంజాగుట్ట మాదకద్రవ్యాల కేసులో నిందితులుగా ఉన్నవాళ్లకు, పుడింగ్ పబ్ నిర్వాహకులకు పరిచయాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కొన్ని ఆధారాలను సైతం పోలీసులు సేకరించారు. పంజాగుట్ట కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టోనీ.. ఏజెంట్ల సాయంతో హైదరాబాద్, బెంగళూరు, గోవా, ముంబయిలో మాదకద్రవ్యాలు సరఫరా చేశాడు. బాబూషేక్, నూర్‌మహమ్మద్ అనే ఏజెంట్లు హైదరాబాద్‌లో 12 మంది వ్యాపారులకు డ్రగ్స్ సరఫరా చేయడానికి వచ్చి టాస్క్‌ఫోర్స్ పోలీసులకు దొరికిపోయారు.
పలు పబ్‌లకు కూడా బాబూషేక్, నూర్‌మహమ్మద్ మాదకద్రవ్యాలు సరఫరా చేసనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బాబూషేక్ వద్ద డ్రగ్స్ తీసుకున్న కొందరు వ్యాపారులకు... పుడింగ్ పబ్ నిర్వాహకులకు పరిచయం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కేవలం పరిచయం వరకు ఆగిపోయిందా..? లేక ఏమైనా లావాదావేలు నిర్వహించారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి...