తిరుమల వెళ్లే భక్తుల కోసం రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సంస్థకి చెందిన బస్సుల్లో వచ్చే వారందరికీ ఇక సొంతంగా వసతి , ఆతిథ్యంతోపాటు స్వామి దర్శనం కల్పించనున్నారు . తిరుచారునూరులో 70 కోట్లతో నిర్మించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన విశాలమైన ఏడు అంతస్థుల పద్మావతి నిలయాన్ని ఏపీటీడీసీ తీసుకుంది .
800మందికి పైగా రాకపోకలు
ఏటా కోటి రూపాయలు అద్దె చెల్లించే ఈ భవనంలో 80 శీతల, 120 శీతలేతర కలిపి మొత్తం 200 గదులు అందుబాటులో ఉంటాయి . అన్ని సదుపాయాలతోపాటు భోజనశాల ఏర్పాటు చేస్తున్నారు . వచ్చే నెల మొదటి వారంలో భవనాన్ని ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ, చెన్నై , బెంగళూరు , కోయంబత్తూరు, కరూరు, కుంభకోణం తదితర చోట్ల నుంచి వివిధ ప్యాకేజీల్లో ఏపీటీడీసీకి చెందిన బస్సుల్లో రోజూ 800 నుంచి 1000 మంది తిరుపతి చేరుకుంటున్నారు . వీరందరికీ ఇప్పటివరకు ప్రైవేట్ హోటళ్లలో వసతి , భోజన ఏర్పాట్లు చేస్తున్నారు .
బస చేసే విధంగా ప్యాకేజీ..!
తితిదేతో ఒప్పందం ప్రకారం కేటాయిస్తున్న స్లాట్లలో 300 రూపాయల టిక్కెట్ పై స్వామి వారి దర్శనం కల్పిస్తున్నారు. పద్మావతి నిలయం ప్రారంభమయ్యాక రోజూ 2 వేల మంది భక్తుల్ని తిరుపతికి తీసుకెళ్లేలా పర్యాటకాభివృద్ధి సంస్థ కార్యాచరణ సిద్ధం చేస్తోంది . ఇప్పటివరకు వివిధ ప్రాంతాల నుంచి తెల్లవారుజామున బస్సుల్లో భక్తులను తీసుకొచ్చి.... ప్రైవేట్ హోటళ్లలో వీరంతా కాలకృత్యాలు తీర్చుకున్నాక తిరుమల కొండ పైకి తీసుకెళ్లి స్వామి దర్శనం కల్పిస్తున్నారు . ఇక నుంచి అవసరమైతే ఒక రోజు రాత్రి బస చేసే విధంగా కూడా ప్యాకేజీ రూపొందిస్తున్నారు. రోజూ 1500 నుంచి 2 వేలమంది 300 రూపాయల టిక్కెట్ పై స్వామి దర్శనం చేసుకునేలా తితిదే నుంచి అనుమతి కోసం యత్నిస్తున్నారు. ఈ మేరకు త్వరలో ఆన్లైన్ బుకింగ్ భక్తులకు అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారి తెలిపారు.
ఇదీ చదవండి : నేడు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం జగన్