రాష్ట్రంలో పలు బస్టాండ్లు, డిపోల్లోని ఖాళీ స్థలాలను బీవోటీ (నిర్మించు, నిర్వహించు, బదలాయించు) పద్ధతిన లీజుకు ఇచ్చేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. ఆర్టీసీకి వివిధ నగరాలు, పట్టణాల్లోని బస్టాండ్లు, డిపోలు, గ్యారేజీలవద్ద విలువైన స్థలాలున్నాయి. తొలి విడతగా నర్సరావుపేట, చిలకలూరిపేట, తెనాలి, బాపట్ల, నెల్లూరు, గూడూరు, హిందూపురం, ఉరవకొండ, కర్నూలు, రాజమహేంద్రవరం బస్టాండ్లవద్ద ఉన్న స్థలాలను లీజుకు ఇచ్చేందుకు అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో దుకాణాలు, వాణిజ్య సముదాయాలకు ఉన్న డిమాండ్‌ను అంచనా వేస్తున్నారు. లీజు గడువు గరిష్ఠంగా 33 ఏళ్లు పెట్టనున్నారు.
మరోవైపు ఆర్టీసీ స్థలాలను పెట్రోల్ బంకుల ఏర్పాటుకు పెట్రోలియం సంస్థలకు ఇచ్చే బదులు సొంతంగా బంకులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట, పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో ఆర్టీసీకి పెట్రోల్ బంకులున్నాయి. అక్కడి లాభాలను చూసి రాష్ట్రంలో మరో 20 చోట్ల బంకులను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. లీటరు ఇంధన విక్రయానికి రూ.3 వరకు కమిషన్ దక్కుతుండగా.. అందులో సగం ఖర్చులు పోను మిగతాదంతా ఆదాయంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కొత్త ఎండీగా సీహెచ్.ద్వారకా తిరుమలరావు బాధ్యతలు తీసుకున్నాక స్థలాలతో అదనపు ఆదాయం రాబట్టడంపై దృష్టిపెట్టారు.
ఇదీ చదవండి: