తాము ప్రయాణించాలనుకున్న బస్సు ఎక్కడుంది? ఎప్పుడు వస్తుంది? గమ్యస్థానానికి ఏ సమయానికి చేరుకునే వీలుంటుందనే సమాచారం తెలిపే ఆర్టీసీ లైవ్ ట్రాకింగ్ యాప్ కొద్ది నెలలుగా సక్రమంగా పనిచేయడం లేదు. అనేక సర్వీసుల ట్రాకింగ్ చూపడం లేదు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గతంలో ఈ యాప్ ద్వారా బస్సు ఎన్ని గంటలకు వస్తుందో చూసుకొని, ఆ సమయానికి బస్టాండ్, బస్టాప్‌నకు వెళ్లేవారు. ఇపుడు ఆ సమాచారం తెలియక.. ముందే చేరుకొని వేచి ఉండాల్సి వస్తోంది.
ఆర్టీసీ లైవ్ ట్రాకింగ్ యాప్‌ను నాలుగేళ్ల కిందట అమల్లోకి తెచ్చారు. వెహికల్ ట్రాకింగ్ యూనిట్ ద్వారా పర్యవేక్షిస్తుంటారు. మూడేళ్లపాటు ఈ యాప్ నిర్వహణ చూసిన గుత్తేదారు సంస్థ గడువు ముగియడంతో.. గత ఏడాది చివర్లో టెండర్లు పిలిచారు. కొత్త సంస్థ గత డిసెంబరులో ఈ బాధ్యత తీసుకుంది. 11,500 బస్సులకుగాను ఈ ఏడాది మార్చి ఆరంభం నాటికి దాదాపు 9 వేల బస్సుల ట్రాకింగ్ ఈ యాప్‌లో క్రోడీకరించారు. తర్వాత లాక్‌డౌన్‌తో బస్సులు నిలిచిపోయాయి. దాదాపు ఆరేడు నెలలపాటు ట్రాకింగ్ యూనిట్‌ను పక్కనపెట్టడంతో అది పనిచేయడం మానేసింది.
రిజర్వేషన్ సర్వీసులకు పునరుద్ధరణ..
ప్రస్తుతం మళ్లీ ఈ యాప్ ద్వారా బస్సుల ట్రాకింగ్‌ను క్రమంగా పునరుద్ధరిస్తున్నారు. ప్రస్తుతానికి రాష్ట్రమంతా రిజర్వేషన్ సదుపాయం ఉన్న సర్వీసులు 2,500 ఉండగా, వాటి వివరాలు ఈ యాప్‌లో లభించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికి 1,400 బస్సుల ట్రాకింగ్ అందుబాటులోకి వచ్చింది. ఈ నెలాఖరు నాటికి మిగిలిన 1,100 సర్వీసుల వివరాలు కూడా చేరుస్తామని అధికారులు చెబుతున్నారు. సంక్రాంతి కల్లా బస్సుల ట్రాకింగ్‌కు సమస్యలు ఉండవని పేర్కొంటున్నారు.
ఇదీ చదవండి: