High Court: రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోద ముద్ర వేశారు. కేంద్ర న్యాయ శాఖ సోమవారం వీరి నియామకాలపై ఉత్తర్వులు జారీచేసింది. న్యాయమూర్తులుగా నియమితులైన వారిలో అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు, డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, బండారు శ్యాంసుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వరాహా లక్ష్మీనరసింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణ ఉన్నారు. మొదటి నలుగురిని న్యాయమూర్తులుగా, మిగతా ముగ్గురిని అదనపు జడ్జీలుగా నియమించారు. వీరు బుధ లేదా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం న్యాయాధికారుల కోటా నుంచి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ ఈ ఏడుగురి పేర్లను ఈ ఏడాది జులై 20న కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులిచ్చింది. రాష్ట్ర హైకోర్టులో 37 మంది (28 శాశ్వత, 09 అదనపు) న్యాయమూర్తులు ఉండాలి. ప్రస్తుతం 24 మంది పనిచేస్తున్నారు. కొత్తవారు ఏడుగురి రాకతో వారి సంఖ్య 31కి చేరింది. అలాగే న్యాయవాది మహబూబ్ సుభానీ షేక్ పేరును ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఆయన నియామకాన్ని రాష్ట్రపతి ఆమోదిస్తే జడ్జీల సంఖ్య 32కు చేరుతుంది.
ఇవీ చదవండి: