పురపాలక ఎన్నికల్లో వార్డు వాలంటీర్ల సేవలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఈ మేరకు కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో కమిషన్ మాట్లాడిందని వెల్లడించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగానే వార్డు వాలంటీర్లపై ఫిర్యాదులు కమిషన్‌కు వచ్చాయని తెలిపారు. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తేలితే స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం వాలంటీర్లపై కఠినమైన చర్యలు అవసరమని ఎస్ఈసీ అభిప్రాయపడ్డారు. వార్డు వాలంటీర్లను రాజకీయ ప్రక్రియ నుంచి పూర్తిగా దూరంగా ఉంచాలని ఆదేశించారు.
'అభ్యర్థి, పార్టీకి అనుకూలంగా వాలంటీర్లు ప్రచారంలో పాల్గొనకూడదు. పథకాల పేరుతో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయకూడదు. ఓటరు స్లిప్పుల పంపిణీని వార్డు వాలంటీర్లకు అప్పగించవద్దు. వార్డు వాలంటీర్ల కదలికలను నిశితంగా పరిశీలించాలి. లబ్ధిదారుల డేటా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉన్నందున వాలంటీర్ల ఫోన్లను నియంత్రణలో ఉంచాలి. ఉల్లంఘిస్తే మోడల్ ప్రవర్తనా నియమావళి తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణిస్తాం. వాలంటీర్లను సాధారణ బాధ్యతల్లో నిర్వహించడంలో ఎలాంటి అడ్డంకులు లేవు'- ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్
ఇదీ చదవండి