ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతీసేలా పత్రికలు, టీవీ ఛానళ్లు, సామాజిక మాధ్యమాలు నిరాధార వార్తలు ప్రచురించినా, ప్రసారం చేసినా ఫిర్యాదు చేసేందుకు, కేసులు వేసేందుకు వీలుగా ఆయా శాఖల కార్యదర్శులకు అధికారాన్ని అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్ 30న జీవో 2430ను జారీచేసిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా పాత్రికేయ వర్గాల నుంచి తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. పలు పాత్రికేయ సంఘాలు ఈ జీవో పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేసేదేనని, ప్రభుత్వం దీన్ని ఉపసంహరించుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయి. ఈ జీవోను సవాలు చేస్తూ సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీన్ని పరిష్కరిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది.
ఈ వ్యాజ్యంలో ప్రభుత్వం కోర్టులో కౌంటర్ దాఖలు చేస్తూ.. ‘వివిధ మాధ్యమాల్లో ఏవైనా నిరాధార వార్తలు వచ్చినప్పుడు దానిపై స్పందించేందుకు, అవసరమైతే చట్టప్రకారం ఫిర్యాదులు చేసేందుకు, తగిన కేసులు వేసేందుకు వివిధ శాఖల కార్యదర్శులకు అధికారాలు అప్పగించాం. అంతేగానీ క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నదే మా ఉద్దేశం కాదు’ అని వివరించింది. ఈ వివరణను ధర్మాసనం తన ఉత్తర్వుల్లో ప్రత్యేకంగా ప్రస్తావించింది. పత్రికాస్వేచ్ఛపైనా, సమాచార సేకరణ, వార్తల ప్రచురణ, ప్రసారాలు చేసుకునే స్వేచ్ఛపైనా పరిమితులు విధించాలనుకోవడం లేదంటూ ప్రభుత్వం చెప్పిన అంశాన్ని గుర్తుచేసింది. ప్రభుత్వం తన కౌంటర్లో పేర్కొన్న వివరాల్ని పరిగణనలోకి తీసుకుంటూ.. ఇప్పుడు ఈ విషయంలో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఏదైనా కథనం విషయంలో జీవో 2430 ప్రకారం ప్రభుత్వం తగిన ఫోరం ముందు చర్యలు ప్రారంభిస్తే ఆ ఆరోపణలు సమర్థనీయమా.. కాదా? అనే అంశంపై విచారించే స్వేచ్ఛ సంబంధిత అథార్టీ/ఫోరం/కోర్టుకు ఉంటుందని పేర్కొంది.
ఇదీ చూడండి: 'హైకోర్టు నోటీసులిచ్చిన వారందరికీ అండగా ఉంటాం'