విజిలెన్స్ కార్యాలయాలను వెలగపూడి నుంచి కర్నూలుకు తరలించేందుకు ప్రభుత్వం జీవో ఇవ్వటంపై.... హైకోర్టు మండిపడింది. కార్యాలయాల తరలింపుపై జనవరి 31న జారీచేసిన జీవోపై.... తాళ్లాయపాలెం గ్రామానికి చెందిన రైతులతో పాటు... అమరావతి పరిరక్షణ సమితి వేర్వేరుగా వేసిన పిటిషన్లపై న్యాయస్థానం విచారించింది. కార్యాలయాల తరలింపు వెనుక దురుద్దేశం ఉందని, ప్రజాధనం వృథా అవుతుందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. రాజధానిపై పిటిషన్లు తమ వద్ద అపరిష్కృతంగా ఉన్నాయన్న హైకోర్టు... ఈ దశలో తరలింపుపై తొందరెందుకని ప్రశ్నించింది. రెండేళ్ల నుంచి ఇక్కడే కొనసాగుతున్న కార్యాలయాలను మరికొన్నాళ్లు కొనసాగిస్తే తప్పేంటని నిలదీసింది. కార్యాలయాల తరలింపుపై స్టేటస్‌కో ఉత్తర్వులు ఇస్తామని ఓ దశలో ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
దాగుడు మూతలు అవసరం లేదు...
సచివాలయంలో విజిలెన్స్ కార్యాలయాల నిర్వహణకు తగినంత స్థలం లేకపోవటంతోనే తరలింపు చేస్తున్నట్లు ఏజీ... న్యాయస్థానానికి తెలిపారు. ఆ రెండు స్వతంత్ర సంస్థలని, వాటి తరలింపు ప్రభుత్వ విధానపర నిర్ణయమని వివరించారు. స్థలం లేకపోతే ఇక్కడే అదనపు భవనాలను నిర్మించొచ్చుగా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఒకవేళ కార్యాలయాలను తరలిస్తే దానికి బాధ్యులైన అధికారుల నుంచి సొమ్మును రాబడతామని హెచ్చరించింది. కార్యాలయాలు అమరావతి మాస్టర్‌ప్లాన్‌లో నోటిఫై అయివున్నాయని, వాటిని తరలించడానికి వీల్లేదని... పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. జోక్యం చేసుకున్న ఏజీ... కార్యాలయాలు నోటిఫై కాలేదని, అవి శాశ్వతం కూడా కాదని కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంలో దాగుడుమూతలు అవసరం లేదన్న న్యాయస్థానం.... వివరాలన్నింటినీ తమ ముందు ఉంచాలని ఆదేశించింది. ప్రమాణపత్రం దాఖలుకు సమయం కావాలన్న ఏజీ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది.