విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదినం రోజు ఆలయ మర్యాదల విషయంలో దేవదాయ శాఖ మెమో జారీ చేయడంపై.... హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. మత సంబంధ విషయాల్లో ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుందన్న న్యాయస్థానం... ఇతర మతాల వారి విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తారా? అని ప్రశ్నించింది. మెమోను సస్పెండ్ చేస్తామని స్పష్టం చేసింది. ఈ నెల 9న దేవదాయశాఖ కమిషనర్‌కు శారదా పీఠం మేనేజరు రాసిన లేఖను ఉపసంహరించుకుంటామన్న న్యాయవాది వినతిని సమ్మతించిన హైకోర్టు.. అనంతరం వ్యాజ్యాన్ని పరిష్కరించింది. లేఖ ఉపసంహరణ నేపథ్యంలో.. ఈ నెల 12న దేవదాయశాఖ అదనపు కమిషనర్ జారీ చేసిన మెమో ప్రభావం కోల్పోతుందని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం..ఈమేరకు ఆదేశాలిచ్చింది.
ఈ నెల 18న స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదినం రోజున ప్రముఖ దేవాలయాల్లో ఆలయ మర్యాదలు పాటించడం కోసం... దేవదాయ శాఖ కమిషనర్‌కు విశాఖ శారదాపీఠం మేనేజర్ పి.రామకృష్ణ ఈ నెల 9 న లేఖ రాశారు. అరసవల్లి, సింహాచలం, అన్నవరం, అంతర్వేది సహా ప్రముఖ ఆలయాల ఈవోలకు లేఖను పంపుతూ.. దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఈ నెల 12న మెమో జారీ చేశారు. మెమోను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన పిల్‌పై వాదనలు వినిపించిన న్యాయవాది ప్రసాద్ బాబు... మత సంబంధ విషయాల్లో ప్రభుత్వ జోక్యానికి వీల్లేదన్నారు. స్వరూపానంద పుట్టినరోజున 23 దేవాలయాల్లో ఆలయ మర్యాదలు పాటించాలంటూ దేవదాయ శాఖ అదనపు కమిషనర్ మెమో జారీ చేసినట్లు.... ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. రాముడు, కృష్ణుడు, హనుమాన్ జయంతి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని... ఓ స్వామీజీ పుట్టిన రోజున ఆలయ మర్యాదలు పాటించాలని కోరడం నిబంధనలకు విరుద్ధమని అన్నారు. ఆలయాల నిధులు, నిర్వహణ, అంతర్గత విషయంలో జోక్యం చేసుకోవడం... అధికరణ 26ని ఉల్లంఘించడమే అవుతుందన్నారు. ఓ స్వామీజీ విషయంలో ఆలయ మర్యాదలు పాటించాలనడం... ఇతర స్వామీజీలను తక్కువ చేయడమే అవుతుందన్నారు. ఆ మెమో అమలును నిలుపుదల చేయాలని కోరారు.
దేవాదాయ శాఖ కార్యదర్శి, కమిషనర్ తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్... మఠం మేనేజర్ నుంచి వచ్చిన లేఖను ఆలయాలకు పంపించినట్లు కోర్టుకు తెలిపారు. దాన్ని తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదని... ఆలయాల విధుల్లో జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించమని కోరలేదని... రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఖర్చుచేయడం లేదని నివేదించారు. మర్యాదల విషయంలో నిర్ణయం ఆలయాలదేనన్నారు. గతంలోనూ పీఠాధిపతుల పుట్టినరోజులకు ఆలయ మర్యాదలు పాటించారని తెలపగా.... గత విషయాల్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారని ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది. శారదా పీఠం మేనేజర్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ఎస్ఎస్.ప్రసాద్... ఎలాంటి తప్పు లేకపోయినా మత సంబంధ వ్యక్తిని కోర్టుకు లాగడం దురదృష్టకరమన్నారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ధర్మాసనం... ఈ వ్యవహారంలో దేవదాయ శాఖ జోక్యం చేసుకోవడం కూడా దురదృష్టకరమని పేర్కొంది. పీఠాన్ని అనవసరంగా వివాదంలోకి లాగకూడదనే ఉద్దేశంతో... మేనేజర్ రాసిన లేఖను ఉపసంహరించుకోవడానికి అనుమతివ్వాలని న్యాయవాది కోరారు. అందుకు అంగీకరించిన హైకోర్టు ధర్మాసనం... లేఖను ఉపసంహరించుకున్నందున దేవదాయ శాఖ జారీ చేసిన మెమో ప్రభావం కోల్పోతుందని స్పష్టంచేసింది.
ఇదీ చదవండి: ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలి: చంద్రబాబు