AP hihg court on FBO Yashodabai case: పశ్చిమగోదావరి జిల్లా అటవీశాఖ అధికారి యశోదబాయికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ ఏడాది ఆగస్టు 10న.. కోర్టుదిక్కరణ కేసులో ఆమెకు రెండు నెలల సాధారణ జైలు శిక్ష, రూ . 2 వేల జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి జారీచేసిన ఉత్తర్వులను ధర్మాసనం రద్దు చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది. కన్నాపురం అటవీ రేంజ్ పరిధిలో కలస, టేకు రవాణా కోసం ఈ ఏడాది జనవరి 12న అధికారులు ప్రకటన ఇచ్చారు. ఏలూరుకు చెందిన శరత్ రెడ్డి టెండర్లో పాల్గొని తక్కువ బిడ్ వేశారు. ఆ ఫైనాన్సియల్ బిడ్ తెరవకుండా.. అటవీ అధికారులు సొంత మనుషులతో పనులు ప్రారంభించారు. ఈ వ్యవహారంపై శరత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. టెండర్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు పనులు చేపట్టవద్దని ఫిబ్రవరి 15న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఆ ఉత్తర్వులకు కట్టుబడి ఉండకపోవడంతో పిటిషనర్ కోర్టుదిక్కరణ వ్యాజ్యం వేశారు. దానిపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. యశోదబాయికి జైలుశిక్షతో పాటు జరిమానా విధించారు.
ఆ ఉత్తర్వులపై ఆమె ధర్మాసనం ముందు అప్పీల్(FBO Yashodabai defamation case news) వేశారు. విచారణ జరిపిన ధర్మాసనం ఈ అప్పీల్ పెండింగ్లో ఉండగా.. శరత్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి కొట్టేశారని గుర్తుచేసింది. ఆ పనులు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించలేదని.. కేవలం శాఖాపరంగా మాత్రమే చేపట్టినట్లు ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో యశోదబాయిని శిక్షించేందుకు సరైన కారణం లేదని తెలిపింది. శిక్ష విధిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్చును హైకోర్టు రద్దుచేసింది.
ఇదీ చదంవడి..
NIMMAGADDA : "జగన్ అక్రమాస్తుల కేసు నుంచి.. నా పేరు తొలగించండి"