High Court on YS Viveka Murder Case Victims Bail Petition:మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు వై.సునీల్ యాదవ్ (ఏ2), గజ్జల ఉమాశంకర్‌రెడ్డి (ఏ3) దాఖలు చేసిన బెయిలు పిటిషన్లపై విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్ వైదొలగారు. ఈ పిటిషన్లు తగిన బెంచ్ ముందుకు విచారణకొచ్చే వ్యవహారంపై నిర్ణయం తీసుకునేందుకు ఫైల్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర వద్ద ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.
నిందితులు సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి దాఖలు చేసిన బెయిలు పిటిషన్లు సోమవారం జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ వద్దకు విచారణకు వచ్చాయి. సీబీఐ తరఫు న్యాయవాది చెన్నకేశవులు స్పందిస్తూ.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి బెయిలు పిటిషన్‌ను వేరే బెంచ్ ముందు విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఇదే కోర్టు ఇటీవల ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు. దాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. తాజాగా దాఖలైన రెండు బెయిలు పిటిషన్ల విచారణ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు.
మరోవైపు కడపలోని రిమ్స్ ఠాణా పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్ దాఖలు చేసిన వ్యాజ్యం వేసవి సెలవుల తర్వాతకు వాయిదా పడింది. సోమవారం ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ విచారణ జరిపారు. ప్రతివాదుల తరఫు న్యాయవాదులు కౌంటర్ వేసేందుకు సమయం కోరడంతో వాయిదా వేశారు.
ఇదీ చదవండి: సీపీఎస్‌పై చర్చించేందుకు ఐదుగురు సభ్యులతో మంత్రుల కమిటీ