రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో రుసుములను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆగస్టు 24న జారీచేసిన 53, 54 జీవోలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. పాఠశాల విద్యాశాఖ, ఇంటర్ బోర్డు అధికారులు పూర్తి వివరాలను సమర్పించేందుకు విచారణను గురువారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూ.దుర్గాప్రసాదరావు మంగళవారం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. జీవో 53, 54లను సవాలు చేస్తూ ‘తూర్పుగోదావరి ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్’ అధ్యక్షుడు దాసరి దుర్గా శ్రీనివాసరావు, మరికొన్ని విద్యా సంస్థల ప్రతినిధులు హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
పాఠశాలల్లో ఫీజులపై మరో వ్యాజ్యం
ప్రైవేటు పాఠశాలల్లో 2021-24 విద్యా సంవత్సరాలకు రుసుమును ఖరారు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన జీవో 53ను సవాలు చేస్తూ హైకోర్టులో మంగళవారం మరో వ్యాజ్యం దాఖలైంది. ఇండిపెండెంట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.శ్రీకాంత్‌బాబు ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. ‘జీవో అమలైతే పాఠశాలలు మూతపడతాయి. రుసుములను ఖరారు చేయడానికి ముందు ఏపీఎస్‌ఈఆర్‌ఎంసీ.. ప్రైవేటు అన్‌ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాల సంఘ సభ్యులతో చర్చించినట్లు జీవోలో పేర్కొనడం తప్పు’ అని వ్యాజ్యంలో పేర్కొన్నారు.