ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సహాయ లైబ్రేరియన్లుగా పనిచేసిన వాళ్లు.. గ్రంథాలయం, సమాచార సాంకేతిక శాఖలో రెగ్యులర్ బోధన సిబ్బంది కిందకు రారని హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ యూనివర్సిటీ చట్టంలోని 2వ సెక్షన్‌లో 23వ నిబంధన అయిన.. టీచర్ ఆఫ్ ది యూనివర్సిటీ లేక రెగ్యులర్ యూనివర్సిటీ టీచర్ అనే నిర్వచన కిందకురారని పేర్కొంది. కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లను వర్సిటీ టీచర్లుగా పరిగణించాలని.. వారికి 62 ఏళ్ల పదవీ విరమణ వయసు వర్తింపచేయాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం రద్దుచేసింది.
అయితే సింగిల్ జడ్జి ఉత్తర్వులు అమల్లో ఉండగా పిటిషనర్లను వర్సిటీ అధికారులు పదవీ విరమణ చేయించడాన్ని ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది . కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని అభిప్రాయపడిన హైకోర్టు.. పిటిషనర్లకు జీతభత్యాలను నిలిపేసిన దగ్గర్నుంచి.. తాజా తీర్పు వచ్చినంతవరకూ చెల్లించాలని ప్రభుత్వాన్ని, వర్సిటీని ఆదేశించింది.
ఇదీ చదవండి: రంజాన్ ప్రారంభం: ముస్లిం సోదరులకు సీఎం జగన్ శుభాకాంక్షలు