ఉపాధి హామీ పథకం (నరేగా)లో రాష్ట్రానికి అదనంగా నాలుగు కోట్ల పని దినాలు కేటాయించే వీలుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇప్పటికే కేటాయించిన పని దినాలు, వీటిలో ఇప్పటివరకు వినియోగించినవి, వలస కూలీలు గ్రామాలకు చేరుకుంటున్నందున అదనంగా అవసరమయ్యే పని దినాలపై అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకానికి కేంద్రం అదనంగా మరో రూ.40 వేల కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. సొంత రాష్ట్రాల బాట పడుతున్న కార్మికులకు నరేగాలో విధిగా ఉపాధి కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.
2020-21 సంవత్సరానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రానికి కేటాయించిన 21 కోట్ల పని దినాల్లో ఇప్పటివరకు 3.37 కోట్లకుపైగా ఉపయోగించారు. లాక్‌డౌన్ ప్రభావం ఏప్రిల్‌లో కొంత కనిపించినా క్రమంగా కూలీల హాజరు పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం రోజూ 30 లక్షలకుపైగా హాజరవుతున్నారు. సొంతూళ్లకు చేరుతున్న వలస కూలీల కుటుంబాలకు 45 రోజుల వ్యవధిలో అధికారులు 30 వేలకుపైగా కొత్త జాబ్ కార్డులు జారీ చేశారు. ఇప్పటికే అమలులో ఉన్న 60 లక్షలకుపైగా ఉన్న జాబ్ కార్డులకు ఇవి అదనం. కార్డు కలిగిన ఒక్కో కుటుంబానికి ఏడాదిలో వంద రోజులపాటు ఉపాధి కల్పించనున్నారు. సొంతూళ్లకు చేరుకుంటున్న వలస కూలీలకు అదనంగా మరో లక్షన్నర జాబ్ కార్డులు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. పెరిగే కార్డుల ఆధారంగా ఇప్పటికే కేటాయించిన పనిదినాలకంటే అదనంగా 4 కోట్లు కేటాయించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: