రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు నమోదు కావడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల స్థానిక ఎన్నికల హడావుడి తగ్గిపోయి కరోనా వైరస్ భయం పెరిగింది. అయితే... ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్య అధికారులు స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తి కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనుమానితులను ప్రత్యేక ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వైద్యులు సూచించారు.
నెల్లూరు యంత్రాంగం అప్రమత్తం
రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైన నెల్లూరు జిల్లాలో యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటలీ నుంచి వచ్చిన ఓ యువకునికి కరోనా వైరస్ నిర్ధరణ అయ్యింది. అతన్ని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరొకరి రక్త నమూనాలను పరీక్ష కోసం తిరుపతి స్విమ్స్‌కు పంపించారు. విదేశాల నుంచి వచ్చిన వారిని, వారి బంధువులను నెల్లూరు జీజీహెచ్ ఐసోలేషన్ వార్డులో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. వీరు కాక 150 మంది విదేశాల నుంచి వచ్చిన వారి జాబితాను అధికారులు సిద్ధం చేశారు. వీరికి ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. కరోనా నియంత్రణకు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. జిల్లాలో పలు ప్రైవేట్ వైద్యశాలల్లోనూ ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. వాలంటీర్లు, ఏఎన్ఎంల సహాయంతో ఇంటింటి సర్వే చేస్తున్నారు. సమస్య వస్తే వెంటనే వైద్య బృందాలు వెళ్లేందుకు వీలుగా సంచార వాహనం, ర్యాపిడ్ యాక్షన్ వైద్య బృందాలను సిద్ధం చేశారు.
విశాఖలో ఆరోగ్య శాఖ చర్యలు
విశాఖలో కరోనా మహమ్మారి ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ విమ్స్ ఆస్పత్రిలో క్వారంటైన్ వార్డును ప్రారంభించారు. ప్రభుత్వం నియమించిన నోడల్ అధికారి డాక్టర్ రాంబాబు విమ్స్‌లో ఈ వార్డును పరిశీలించారు. ఈ వార్డులో కరోనా లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తులను వైద్యులు 14 రోజుల పాటు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారు. అనంతరం ఇళ్లకు పంపిస్తారు. రోగులు ఇక్కడ ఉండేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశారు.
ఒంటిమిట్ట రామయ్యకూ కరోనా ఎఫెక్ట్
కరోనా ప్రభావం ఒంటిమిట్ట రామయ్యనూ తాకింది. శ్రీరామ నవమి సందర్భంగా.. వేడుకల అనంతరం ఏప్రిల్ 7న బహిరంగ ప్రదేశంలో నిర్వహించే కల్యాణాన్ని రద్దు చేసింది. ఈ వేడుకకు లక్ష మంది భక్తులు హాజరవుతారని అంచనా. ప్రభుత్వం అధికారికంగా పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకు రావడం ఆనవాయితీ. అయితే.. కరోనా ప్రభావం కారణంగా ఒకే ప్రదేశంలో లక్ష మంది హాజరు కావడం మంచిది కాదనే ఉద్దేశంతో తక్కువ మంది వీక్షించేలా కల్యాణం జరిపించాలని తితిదే నిర్ణయించింది. ఏప్రిల్ 1 న ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 7వ తేదీ రాత్రి స్వామివారి కల్యాణం జరగనుంది.
చైనా నుంచి స్వగ్రామానికి యువతి...
చైనాలో కరోనా వైరస్ నేపథ్యంలో చిక్కుకున్న కర్నూలు జిల్లాకు చెందిన అన్నెం జ్యోతి సురక్షితంగా స్వగ్రామానికి చేరుకున్నారు. తమకు సహాయం చేసిన ప్రభుత్వం, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె ఉద్యోగ శిక్షణ నిమిత్తం అక్కడికి వెళ్లారు. చైనా నుంచి భారత్‌కు వచ్చే క్రమంలో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని నిలిపేయడంపై ఆందోళన చెందానని జ్యోతి తెలిపారు. ఈమె వివాహం మార్చి 15న జరగాల్సి ఉండగా వాయిదా పడింది.
ఇదీ చూడండి:
కరోనా ప్రభావం: 31 వరకు తెలంగాణలో విద్యాసంస్థలు, మాల్స్ మూసివేత