ప్రభుత్వం కొత్తగా మూడు జీవోలను జారీ చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖ, రహదారులు భవనాల శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
బీమా సదుపాయం కల్పిస్తూ..
2019 ఖరీఫ్ నుంచి ఉచిత పంటల బీమా సదుపాయాన్ని కల్పిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్రంలో ఈ పథకాన్ని 2020 డిసెంబరు 15న ప్రారంభించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే గత ఖరీఫ్‌కు సంబంధించిన పంటలకూ బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నట్టుగా వ్యవసాయ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు జాతీయ పంటల బీమా పోర్టల్‌లో నమోదైన రైతులు ఎలాంటి ప్రీమియాన్ని చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. నమోదు సమయంలో చెల్లించాల్సిన ఒక్క రూపాయిని మాత్రం చెల్లిస్తే రైతు వాటా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేసింది.
కాంట్రాక్ట్ ఉద్యోగుల గడువు పొడిగిస్తూ..
రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఏసీబీ, హోంశాఖ, యువజన సర్వీసు, సాంస్కృతిక శాఖలోని ఉద్యోగులను 2021 మార్చి 31వ తేదీ వరకూ సర్వీసును పొడిగిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థికశాఖ ముందస్తు అనుమతి లేకుండా ఏ కాంట్రాక్టు ఉద్యోగిని కొనసాగించొద్దంటూ ప్రభుత్వ శాఖలు, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లకు ఆర్థిక శాఖ సూచించింది. ఇప్పటికే ముందస్తుగా అనుమతి తీసుకున్న మరికొన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టులు ఉద్యోగుల సర్వీసును కూడా ఆర్థిక శాఖ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
రహదారులకు మరమ్మతులపై
గోతులు పడిన రాష్ట్ర రహదారులు, ప్రధాన జిల్లా రహదారులు , ఇతర రహదారులను అత్యవసర ప్రాతిపదికన మరమ్మతులు చేసేందుకు రహదారులు భవనాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. రహదారుల మరమ్మతుల కోసం 388 కోట్ల రూపాయలకు పాలనానుమతులు ఇస్తూ రహదారులు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఉత్తర్వులు ఇచ్చారు. తుపాన్లు, భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులను తనిఖీ చేసిన అనంతరం అత్యవసర మరమ్మతులకు సిఫార్సులు రావటంతో ఈ నిధులు విడుదల చేస్తున్నట్టు రహదారులు భవనాల శాఖ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు