కేంద్ర హోంశాఖ జారీ చేసిన కొవిడ్-19 అన్ లాక్ 5 నిబంధనల్ని నోటిపై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దశలవారీగా వివిధ రంగాలను తెరుచుకునేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయించింది. కొవిడ్ అన్ లాక్ 5 నిబంధనలు అక్టోబరు 31 తేదీ వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. కంటైన్మెంటు జోన్లు మినహా మిగతా అన్ని చోట్ల అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది. అక్టోబరు 15 అనంతరం పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు తెరుచుకునేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాధికారానికే విడిచిపెడుతూ ఆదేశాలు ఇచ్చింది. ఆన్ లైన్, దూరవిద్య తరగతుల నిర్వహించుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. పాఠశాలలు, కళాశాలలకు విద్యార్ధులు హాజరుకు తల్లితండ్రుల అనుమతి తప్పనిసరి చేస్తూ నిబంధన విధించింది. పాఠశాలలు తెరిచేందుకు కేంద్ర విద్యాశాఖ సూచించిన వివిధ ప్రమాణాలను పాటించాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది.
పరిశోధక విద్యార్ధులు , పట్టభద్రులు కళాశాలల్లో సైన్స్ ల్యాబరేటరీలకు హాజరయ్యేందుకు అక్టోబరు 15 నుంచి అనుమతి ఇచ్చింది. క్రీడాకారులకు మాత్రమే ఈతకొలనులు వినియోగించేందుకు అక్టోబరు 15 తర్వాత అనుమతులు ఇవ్వగా... 50 శాతం సామర్ధ్యంతో సినిమాలు, మల్టీప్లెక్సులు తెరిచేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. అక్టోబరు 31 తేదీ వరకూ లాక్ డౌన్ నిబంధనలు కేవలం కంటైన్మెంట్ జోన్లకు మాత్రమే పరిమితం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 65 ఏళ్ల వయసు పైబడిన వ్యక్తులు, 10 ఏళ్ల లోపు చిన్నారులు అత్యవసరం అయితే మినహా బయట తిరగకుండా చూడాలని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి