వైఎస్సార్ జగనన్న కాలనీల్లో పేదల కోసం చేపట్టే ఇళ్ల నిర్మాణంలో ఆకృతి నిబంధనను ప్రభుత్వం సడలించింది. ప్రభుత్వ ఆకృతిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఇంటిని సొంతంగా నిర్మించుకునేవారు తమ ఇష్ట ప్రకారమే కట్టుకునే వెసులుబాటు కల్పించింది. తొలుత లబ్ధిదారులు ప్రభుత్వమే కట్టివ్వాలనే ఆప్షన్‌వైపు ఎక్కువగా మొగ్గు చూపడంతో ఆర్థిక భారాన్ని తగ్గించుకునే క్రమంలో సడలింపు నిర్ణయాన్ని తెరమీదికి తెచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వమే నిర్మించే వాటిని ప్రతిపాదిత ఆకృతి ప్రకారమే చేపడతామని అధికారులు చెప్పడంతో లబ్ధిదారులు ఒకటి, రెండు ఆప్షన్లవైపు మళ్లుతున్నారు. బహిరంగ మార్కెట్లో నిర్మాణ సామగ్రి, కూలీ ఖర్చులు పెరగడంతో పేదలు మొదట్లో మూడో ఆప్షన్‌కే ఎక్కువగా మొగ్గు చూపారు.
మొదటి 5 లక్షల మందిలో 60% మంది మూడో ఆప్షన్‌ను ఎంచుకున్నారు. అదే సమయంలో పలు జిల్లాల్లో ఇళ్ల ఆకృతిపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆకృతి మార్పునకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో తమ ఇష్ట ప్రకారం కట్టుకోవాలని ఆప్షన్లు మార్చుకున్నారు. మరికొన్ని చోట్ల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు క్షేత్ర స్థాయిలో అధికారులే లబ్ధిదారులపై ఒత్తిడి తెచ్చిమార్పించారన్న విమర్శలూ ఉన్నాయి.
ఊరికి దూరం ఉంటేనే..
కొన్ని లేఅవుట్లు లబ్ధిదారులు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతానికి 20-30 కి.మీ. దూరంలో ఉన్నాయి. అంతదూరం వెళ్లి ఇల్లు కట్టుకోవడం ఇబ్బందిగా భావించి ప్రభుత్వం కట్టించే ఇంటికే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటివరకూ వచ్చిన 3.3 లక్షల ఆప్షన్లలో అత్యధికంగా దూరంవల్లే ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులు, అత్యంత పేదవారికే మూడో ఆప్షన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. లబ్ధిదారులు సొంతంగా ఇల్లు కట్టుకుంటే.. ఏకరూపకత కోసం బయటి ఎలివేషన్ మినహా లోపల వారి ఇష్ట ప్రకారమే కట్టుకోవచ్చని చెబుతున్నారు.
సొంత స్థలం ఉన్నవారికి రెండు ఆప్షన్లే:
సొంత స్థలం ఉండి ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వమే ఇల్లు కట్టించే ఆప్షన్ తొలగించారు. ప్రభుత్వం మొదటి విడతలో చేపడుతున్న 15.10 లక్షల ఇళ్లలో సొంత స్థలం ఉన్నవారు 3.87 లక్షల మంది. మొదట్లో వీరినీ 3 ఆప్షన్లకు అనుమతించారు. దీంతో మూడో ఆప్షన్ వైపు చాలామంది మొగ్గుచూపారు. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు వీరికి మూడో ఆప్షన్ తీసేసి మిగతా రెండు ఆప్షన్లకే పరిమితం చేశారు.
3 ఆప్షన్లు
ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలను సాయంగా ఇస్తోంది. ఇంటి నిర్మాణంలో లబ్ధిదారులకు 3 ఆప్షన్లను ప్రకటించింది.
1. ఇంటి నిర్మాణ సామగ్రిని ప్రభుత్వం సమకూరిస్తే లబ్ధిదారులే ఇల్లు కట్టుకోవడం.
2. ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తే లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవడం.
3. ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇవ్వడం.
ఇదీ చదవండి:
త్వరలో డీఎస్సీ... 402 బ్యాక్‌లాగ్ టీచర్ పోస్టులు భర్తీ చేసే అవకాశం!