రాష్ట్రంలో భారీ ఎత్తున నామినేటెడ్ పదవులకు ప్రభుత్వం శనివారం పేర్లు ప్రకటించింది. వివిధ కార్పొరేషన్లు, అకాడమీలు, సమాఖ్యలు, ఆర్టీసీ ప్రాంతీయ బోర్డులు, పట్టణాభివృద్ధి సంస్థలు, డీసీసీబీ, జిల్లా గ్రంథాలయ సంస్థ, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ల ఛైర్మన్ల జాబితాను వెల్లడించింది. మొత్తం 137 సంస్థలకు ఛైర్మన్లను నియమించింది. అందులో 71 రాష్ట్ర, 66 జిల్లా స్థాయివి ఉన్నాయి. తొలుత 135 సంస్థలకు ఛైర్మన్లను ప్రకటించిన ప్రభుత్వం..
శనివారం సాయంత్రం జీసీసీ, ట్రైకార్ ఛైర్మన్ల పేర్లను విడుదల చేసింది. రాష్ట్ర ఆర్థిక సంస్థ, ఆర్టీసీ, ఖనిజాభివృద్ధి, ఏపీఐఐసీ, నెడ్‌క్యాప్, నైపుణ్యాభివృద్ధి, శాప్, పౌర సరఫరాల సంస్థలు, బ్రాహ్మణ, కమ్మ, రెడ్డి, క్షత్రియ, కాపు, కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించింది. హోం మంత్రి సుచరిత, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ శనివారం విజయవాడలో జాబితాను వెల్లడించారు.
ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి మంత్రివర్గ కూర్పు నుంచి నామినేటెడ్ పోస్టుల భర్తీ వరకు అన్నింటా సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం 137 నామినేటెడ్ పోస్టులు ప్రకటించగా.. అందులో 79 పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించామని చెప్పారు. 69 పోస్టులు (50 శాతం) మహిళలకే అప్పగించామని తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ ప్రజల్లో మమేకం కావడం వెనుక ఎంతో మంది నాయకులున్నారని, వారికి ఇప్పుడు అవకాశం కల్పించామని వివరించారు. మిగిలినవారికి పార్టీపరంగా పదవులు ఇస్తామని చెప్పారు. నియామకాల్లో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించే ప్రయత్నం చేశామని వెల్లడించారు. గతంలో మాదిరిగా నామినేటెడ్ పోస్టులు అలంకారప్రాయంగా మిగిలిపోవని స్పష్టం చేశారు. సీఎం తలపెట్టిన మహాయజ్ఞంలో ప్రభుత్వం ఎలా బాధ్యతాయుతంగా పనిచేస్తుందో.. నామినేటెడ్ పోస్టులు పొందిన వారికి అంతే బాధ్యత ఉందని స్పష్టం చేశారు. శనివారం విజయవాడలో నామినేటెడ్ పోస్టుల జాబితా విడుదల సందర్భంగా మంత్రులు సుచరిత, వేణుగోపాలకృష్ణతో కలిసి సజ్జల విలేకర్లతో మాట్లాడారు. ‘జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, మహిళా సాధికారతపరంగా అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కేబినెట్ కూర్పు నుంచి నామినేటెడ్ పదవుల భర్తీ వరకు అన్నింటిలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, మహిళలకు అధిక ప్రాధాన్యమిచ్చాం. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల్లోనూ వీరికే 80 శాతం అవకాశాలు కల్పించాం. బీసీల ఆర్థికాభివృద్ధి, రాజకీయ సాధికారత దిశగా ముందుకెళ్తున్నాం. ప్రభుత్వం, స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, పార్టీ నాయకత్వం అన్నీ కలిసి రాష్ట్రంలో పదిహేనేళ్లలో జరగాల్సిన అభివృద్ధిని వచ్చే ఎన్నికల్లోగా సాధిస్తాం’ అని చెప్పారు.
రాజకీయ అధికారం అందిన ద్రాక్ష: సుచరిత
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గతంలో రాజకీయం అధికారం అందని ద్రాక్షలా ఉండేదని.. ఇప్పుడు అందిన ద్రాక్ష అని హోం మంత్రి సుచరిత, బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. రాజకీయ అధికారం అణగారిన వర్గాలకు అందాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సాయం అందించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలి స్థానంలో ఉందని, పేదరికాన్ని జయించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని వివరించారు. దేశమంతా రాష్ట్రం వైపు చూసేలా జగన్ సామాజిక న్యాయం పాటిస్తూ.. సంక్షేమంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతున్నారని పేర్కొన్నారు. జగన్ అధికారంలోకొచ్చిన నాటి నుంచి తనను నమ్మినవారికి, పార్టీ కోసం పనిచేసినవారికి తగిన న్యాయం చేస్తున్నారని ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేశ్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పేర్కొన్నారు.
ఇదీ చదవండి: