రాష్ట్రంలో రెండు నెలలపాటు పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వాయిదా వేయించాలని కోరుతూ ఏపీ ఉద్యోగ సంఘాల ఐకాస ప్రతినిధులు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాద్ దాస్‌తో సమావేశమయ్యారు. విజయవాడలోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యి.. తొమ్మిది పేజీల వినతిపత్రాన్ని అందజేశారు. ఉద్యోగులకు కొవిడ్ టీకాలు వేసేంత వరకు ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని తెలిపారు.
గత 10 నెలలుగా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నామని.. కరోనా సమయంలో ముందు వరుసలో నిలిచి పనిచేశామని ఉద్యోగ సంఘాల ఐకాస ప్రతినిధులు తెలిపారు. టీకాలు వేస్తున్న సమయంలో ఎన్నికలకు ఎస్‌ఈసీ ఉత్తర్వులు ఇచ్చారని.. ఉద్యోగుల పట్ల ఎస్‌ఈసీ కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. టీకాలు వేసే సమయంలో పంచాయతీ ఎన్నికలు పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. తాము టీకాలు తీసుకోకుండా ఎన్నికల విధుల్లో పాల్గొనడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. టీకాలు ఇచ్చిన అనంతరం ఎన్నికల విధుల్లో పాల్గొంటామని తెలిపారు.
ఇదీ చదవండి: అధికారులపై చర్యలు కోరుతూ సీఎస్, డీజీపీకి ఎస్‌ఈసీ లేఖ