AP PRC: ఇంటి అద్దె భత్యం, ఫిట్‌మెంట్ అంశాలపై పలు ఉద్యోగ సంఘాల నేతలు సీఎంవో కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డితో సమావేశమయ్యారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు, బండి శ్రీనివాసరావు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకటరామిరెడ్డి తదితరులు హెచ్‌ఆర్‌ఏకు సంబంధించిన అంశాలను సీఎంవో కార్యదర్శికి వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీతో ఇంటి అద్దె భత్యం ముడిపడి ఉండటంతో దానిని త్వరితగతిన ఖరారు చేయాలని కోరారు. పీఆర్సీ నివేదికలో ఉన్నట్లుగా వర్గీకరణ చేసి ఇస్తే ఉద్యోగులంతా నష్టపోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు హెచ్‌ఆర్‌ఏకు సంబంధించిన అంశాలపై స్పష్టత ఇచ్చేందుకు ఇవాళ ప్రభుత్వం జీవో జారీ చేసే అవకాశం ఉంది. దీంతో మార్పుచేర్పులకు సంబంధించి సూచనలు చేయాల్సిందిగా ధనుంజయ్ రెడ్డిని ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పాం: బొప్పరాజు
ఉద్యోగ విరమణ వయసు పెంచడం పట్ల ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సొంతింటి కల నెరవేరుస్తామని చెప్పడం సంతోషంగా ఉందన్న ఆయన... ఫిట్‌మెంట్, హెచ్‌ఆర్ఏ, అదనపు పింఛను గురించి ప్రభుత్వానికి స్పష్టంగా వివరించామన్నారు. హెచ్‌ఆర్‌ఏపై కింది స్థాయి నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉందన్నారు. హెచ్‌ఆర్ఏ పై 24, 16, 8 స్లాబులను ఆమోదించవద్దని ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం వస్తుందని అధికారులు చెప్పారని వెల్లడించారు.
"ప్రణాళిక ప్రకారం సమస్యలు పరిష్కరిస్తామని సీఎం చెప్పారు. సమస్యల పరిష్కారానికి సమయం నిర్దేశించడం సంతోషం. హెచ్‌ఆర్ఏ, అదనపు పింఛనుపై అధికారులతో చర్చించాం. హెచ్‌ఆర్‌ఏపై సీఎస్ కమిటీ సిఫారసులు పట్టించుకోవద్దని కోరాం. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం" - బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్
రేపటి సమావేశం వాయిదా..
రేపు జరగాల్సిన ఉద్యోగ జేఏసీల ఐక్య వేదిక విస్తృత స్థాయి సమావేశం వాయిదా పడింది. ప్రభుత్వం అన్ని విషయాల్లో సానుకూలంగా స్పందిస్తున్నందున్న సమావేశాన్ని వాయిదా వేసుకున్నట్టు ఉద్యోగుల జేఏసీ ఐక్య వేదిక తెలిపింది.
పీఆర్సీపై ప్రభుత్వం ప్రకటన..
AP Govt On PRC: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 23 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచింది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. ఫిట్‌మెంట్ సహా కీలక అంశాలపై ప్రకటన చేశారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణ సంఘాల్ని నియమించబోదని, కేంద్ర వేతన సవరణ సంఘం సిఫారసుల్నే అనుసరిస్తామని, ఉద్యోగులకు కూడా దాని వల్లే ఎక్కువ మేలు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులకు ప్రభుత్వం ఇప్పటికే 27 శాతం ఐఆర్ అమలు చేస్తోంది. వారికి 14.29 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని సీఎస్ కమిటీ సిఫారసు చేసింది. 55 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాల ఐకాసలు, కనీసం 34 శాతమైనా ఇవ్వాలని సచివాలయ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేశాయి. వీటన్నింటినీ సమీక్షించిన ప్రభుత్వం 23 శాతం ఫిట్‌మెంట్ ఖరారు చేసింది.
ఇదీ చదవండి:
ఈసీ ప్రెస్మీట్- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీల ప్రకటన!