ఏపీ ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఏపీఈసెట్)లో 92.42శాతం మంది అర్హత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 11 కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈ పరీక్షకు 36,418మంది హాజరు కాగా.. వీరిలో 33,657మంది అర్హత పొందారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో బుధవారం ఛైర్మన్ హేమచంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 14బ్రాంచిలకు పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. సిరమిక్, బీఎస్సీ గణితంలో సీట్ల కంటే దరఖాస్తు చేసిన అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో పరీక్ష నిర్వహించలేదు. సిరమిక్ ఇంజినీరింగ్ అభ్యర్థులకు అకడమిక్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు. డిగ్రీ ఫలితాలు వచ్చిన తర్వాత బీఎస్సీ గణితం అభ్యర్థులకు ర్యాంకులు కేటాయిస్తారు. బయోటెక్నాలజీ కోర్సుకు ఒక్కరూ దరఖాస్తు చేయలేదు. దీంతో దీనికి పరీక్ష పెట్టలేదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు లేవు. బీటెక్‌లో రెండో ఏడాదిలో ప్రవేశానికి ఈ అర్హత పరీక్ష నిర్వహిస్తారు. ప్రాథమిక ‘కీ’పై 1,100 అభ్యంతరాలు రాగా.. వీటిలో ఏడింటిని పరిగణనలోకి తీసుకున్నారు. మూడు ప్రశ్నలకు పూర్తిగా అందరికీ మార్కులు ఇవ్వగా.. నాలుగు ప్రశ్నలకు రెండు ఐచ్ఛికాల్లో ఏది పెట్టినా మార్కులు ఇచ్చారు.
కేటగిరీ-బీ ఇష్టానుసారం కుదరదు..
బీటెక్‌లో కేటగిరీ-బీ యాజమాన్య కోటా సీట్లను ఇష్టానుసారంగా భర్తీ చేయొద్దని కళాశాలల యాజమాన్యాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి హెచ్చరించారు. కేటగిరి-బీలోని 30శాతంలో 15శాతం యాజమాన్య కోటాకు సంబంధించి ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు. 30శాతం సీట్ల భర్తీని పూర్తిగా యాజమాన్యానికి అప్పగించే అంశానికి సంబంధించిన దస్త్రానికి ఇంకా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని వెల్లడించారు.
* ప్రైవేటు బ్రౌన్‌ఫీల్డ్ విశ్వవిద్యాలయాల్లో గతంలోని 70శాతం కన్వీనర్ కోటా యథావిధిగా ఉంటుందని, కొత్తగా పెట్టే కోర్సుల్లో 35శాతం సీట్లు కన్వీనర్ కోటాకు ఇవ్వాల్సి ఉంటుందని హేమచంద్రారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న కళాశాలను ప్రైవేటు వర్సిటీగా మార్పు చేసుకుంటే దాన్ని బ్రౌన్‌ఫీల్డ్‌గా పిలుస్తారు. ఇప్పటికే ఉన్న కళాశాలలోని సీట్లలో 70శాతం కన్వీనర్ కోటా ఉంటుంది. విశ్వవిద్యాలయం ఏర్పడిన తర్వాత కొత్తగా ప్రారంభించే కోర్సుల్లో 35శాతం సీట్లు కన్వీనర్ ద్వారా భర్తీ చేస్తారు. వీటికి ప్రభుత్వమే బోధన రుసుములు చెల్లిస్తుంది. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్లు రామమోహనరావు, లక్ష్మమ్మ, కార్యదర్శి సుధీర్ ప్రేమ్‌కుమార్, ప్రత్యేక అధికారి సుధీర్‌రెడ్డి, జేఎన్‌టీయూ కాకినాడ ఉపకులపతి ప్రసాద్‌రాజు, కన్వీనర్ కృష్ణమోహన్, రిజిస్ట్రార్ సుమలత పాల్గొన్నారు.
ఇవీ చదవంది: