అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16న ప్రారంభం కానున్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో వీలైనన్ని తక్కువ రోజుల్లోనే సమావేశాలను పూర్తి చేసేందుకుగాను 16, 17 తేదీల్లో రెండు రోజులపాటు సభను నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. శాసనసభ వరకు బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఆమోదించడం ప్రక్రియనంతా రెండ్రోజుల్లో ముగిసేలా సిద్ధం చేస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. శాసనమండలిలో మూడో రోజు బడ్జెట్ పెట్టనున్నారు. 16న సమావేశాల ప్రారంభానికి సంబంధించి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గురువారం అధికారిక ప్రకటన జారీ చేశారు. 16న ఉదయం రాజ్‌భవన్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇందుకోసం అవసరమైన సాంకేతిక ఏర్పాట్లను గురువారం ఐటీ విభాగం సిబ్బంది అసెంబ్లీలో పరిశీలించారు. అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులును కూడా కలిసి చర్చించారు.
- 16న ఉదయం గవర్నర్ ప్రసంగం, శాసనసభ వ్యవహారాల సలహా మండలి సమావేశం అదే రోజు మధ్యాహ్నం శాసనసభలో వార్షిక బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
- 17న బడ్జెట్ పద్దులపై చర్చతోపాటు ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించే అవకాశం ఉంది.
- 18న ఈ రెండు బడ్జెట్ల పద్దులు, ద్రవ్య వినిమయ బిల్లును శాసనమండలిలో ఆమోదించే అవకాశం ఉంది.
మాక్ పోలింగ్‌కు ఏర్పాట్లు
ఈ నెల 19న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ అసెంబ్లీ ఆవరణలో జరగనుంది. దీనికి సన్నాహకంగా ఈ నెల 18న వైకాపా ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించుకునేందుకు ఆ పార్టీ శాసనసభాపక్షం ఏర్పాట్లు చేస్తోంది.
ఇదీ చూడండి..