తెలుగు రాష్ట్రాల మధ్య.. కృష్ణా, గోదావరి నదులకు సంబంధించిన అంశాల కోసం ఏర్పాటు చేసిన నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ జులై నెలలో నోటిఫికేషన్ జారీ చేసింది. దాని ప్రకారం రెండో షెడ్యూల్లో పేర్కొన్న ప్రాజెక్టులు గురువారం నుంచి బోర్డుల ఆధీనంలోకి రావాల్సి ఉంది (projects are not surrendered to grmb and krmb). కానీ.. ఇంకా ఆ ప్రక్రియ జరగలేదు.
ఎటూ తేల్చని రాష్ట్రాలు..
సుదీర్ఘ కసరత్తు అనంతరం దశల వారీగా, ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులను తమ ఆధీనంలోకి తీసుకోవాలని బోర్డులు నిర్ణయించాయి. గోదావరి నదిపై ఉన్న ఏకైక ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు మధ్యతరహా ప్రాజెక్టును బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలూ అంగీకరించాయి. అయితే.. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇంకా ఉత్తర్వులు వెలువడలేదు. ఇక, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు సంబంధించి 15 ఔట్ లెట్లను అప్పగించాలని బోర్డు.. రెండు రాష్ట్రాలకూ తెలిపింది. శ్రీశైలం, నాగార్జున్ సాగర్ ప్రాజెక్టుల నుంచి నేరుగా నీరు తీసుకునే ఔట్ లెట్లను అప్పగించేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వాలని బోర్డు తీర్మానించింది.
షరతులతో ఏపీ అంగీకారం..
ఇందులో తెలంగాణకు సంబంధించిన తొమ్మిది, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆరు పాయింట్లు ఉన్నాయి (projects are not surrendered to grmb and krmb). నోటిఫికేషన్ అమలు తేదీ అయిన అక్టోబరు 14 వరకు రెండు రాష్ట్రాల నుంచి ఎలాంటి ఉత్తర్వులూ వెలువడలేదు. అయితే.. తమ పరిధిలోని కొన్ని ఔట్ లెట్లను బోర్డుకు అప్పగించేందుకు గురువారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీకి సంబంధించిన ఆరు ఔట్ లెట్లకు గానూ.. రాష్ట్ర పరిధిలోని శ్రీశైలం, నాగార్జునసాగర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఔట్ లెట్లను మినహాయించి మిగతా వాటిని అందులో పేర్కొంది. శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్ వే, రివర్స్ స్లూయిస్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతలును అప్పగించేందుకు సిద్ధమని తెలిపింది. అయితే.. తెలంగాణ పరిధిలోని ఔట్ లెట్లను అప్పగించినపుడు మాత్రమే స్వాధీనం చేస్తామని స్పష్టం చేసింది. ఇదే సమయంలో జూరాలను కూడా బోర్డు పరిధిలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
స్పష్టత ఇవ్వని తెలంగాణ..
తెలంగాణ మాత్రం ఔట్ లెట్ల స్వాధీనానికి సంబంధించి ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను బోర్డు పరిధిలోకి ఇవ్వబోమని తెలంగాణ ఆది నుంచి చెబుతోంది (projects are not surrendered to grmb and krmb). విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను మినహాయించి మిగతా ఔట్ లెట్లను బోర్డుకు స్వాధీనం చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఇంజినీర్లు.. ప్రభుత్వానికి సూచన చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఔట్ లెట్ల స్వాధీనానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. దీంతో గురువారం సాయంత్రం వరకు రెండు బోర్డులకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉత్తర్వులు అందలేదు. ఏపీ షరతులతో కూడిన ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో తదుపరి ఎలా ముందుకెళ్తారన్నది తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి: ప్రాజెక్టులు బోర్డులకు అప్పగించేందుకు సిద్ధమైన ప్రభుత్వం... కానీ..